ఫెయిల్ అయ్యామని కుంగిపోవద్దు…
1 min read
సప్లిమెంటరిలో సత్తాచూపండి
విద్యార్ధులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హితవు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఇటీవల పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్ధులు ఎంతమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఉద్బోధించారు. పబ్లిక్ పరీక్షల్లో చిన్నచిన్న పొరబాట్ల వల్ల మార్కులు తగ్గి ఫెయిల్ అయి వుండొచ్చన్నారు. అంతేగానీ ఫెయిల్ అయిన విద్యార్ధులు తెలివితేటలు లేనివారు మాత్రం కాదని స్పష్టం చేశారు. ఈ సమయంలో నిరాశచెందకుండా సాధనచేసి ఉత్తీర్ణులు కావాలన్నారు. విద్యార్ధులకు అవసరమైన మెరుగైన విద్యాభోదనను అందించేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎటువంటి ప్రతికూల ఆలోచనలతో ప్రాణాలమీదకు తెచ్చుకోకుండా, నిరాశ, అంధోళన వత్తిడిచెందకుండా నిర్విరామంగా కృషిచేస్తే విజయం తథ్యమని చెప్పారు. మే 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు ఆత్మ విశ్వాసంతో హాజరై ఉత్తీర్ణత సాధించవచ్చన్నారు. జిల్లాలో పదోతరగతి పరీక్షలకు 22,365 మంది విద్యార్ధులు హాజరు కాగా వారిలో 17,274 మంది ఉత్తీర్ణత సాధించారని, ఇయితే మరో 5,091 మంది ఫెయిల్ అయిన విద్యార్ధులు నిరాశ, నిస్పృహలకు గురికాకుండా ఉండేందుకు ప్రధానోపాధ్యాయులు వారికి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. ఈ మేరకు ఆయా విద్యార్ధులకు కూడా పునశ్చరణ తరగతులు కూడా నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా ఫెయిల్ అయిన విద్యార్ధులను ఉత్తీర్ణులు అయ్యే విధంగా ఎంఇవోలు, హెచ్ఎంలు కార్యాచరణ తయారుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ఒకటి, రెండు సబ్జెక్టులలో పాస్ కాని విద్యార్ధులపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.