జాగ్రత్తలతో… ‘రక్తపోటు’ కంట్రోల్..
1 min readఒత్తిడితోనే.. హైపర్ టెన్షన్..
- హార్ట్ ఎటాక్ , మెదడు స్ర్టోక్ వచ్చే ప్రమాదం..
- పోషక ఆహారం.. వ్యాయామంతో కొంత నియంత్రణ
- ప్రముఖ కార్డియాలజిస్ట్, ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్
కర్నూలు, పల్లెవెలుగు: హార్ట్ ఎటాక్, మెదడు స్ట్రోక్ తదితర ఆరోగ్య సమస్యలతో వచ్చే వారిలో అధికంగా రక్తపోటు కారణంగానే మృత్యువాత పడుతున్నారని, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రముఖ కార్డియాలజిస్ట్, ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్. ఆదివారం స్థానిక ఏ క్యాంపులోని ‘ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ నేతృత్వంలో ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ కార్డియాలజిస్ట్, ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ ‘ హైపర్ టెన్షన్ ’పై మెడికల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో వ్యతిరేక రక్త ప్రసరణ కారణంగా ఒత్తిడి అధికమవుతుందని, దీని వల్ల గుండె నొప్పి, హార్ట్ ఎటాక్, మెదడు స్ర్టోక్ , ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇటీవల ఉమ్మడి జిల్లాలో హార్ట్ ఎటాక్, మెదడు స్ర్టోక్‌తో చనిపోయే వారు అధికంగా హైపర్ టెన్షన్ ( అధిక ఒత్తిడి ) కారణంగానే మృతి చెందుతున్నారని, ఇది తెలుసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా చెబుతారు. సాధారణ వ్యక్తులకు 120/80 ఎంఎంహెచ్‌జి ఉంటుంది. బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు 130/80 ఉంటే రక్తపోటు ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తారని, అటువంటి వారు నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ వెల్లడించారు.
రక్త పోటు లక్షణాలు:
- తీవ్రమైన తలనొప్పి
- ముక్కులేని
- అలసట
- మసక దృష్టి
- ఛాతి నొప్పి
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- సక్రమంగా లేని హృదయ స్పందన
అధిక రక్తపోటుకు కారణాలు :
- ధూమపానం
- అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం
- శారీరక శ్రమ లేకపోవడం
- ఆహారంలో ఎక్కువ ఉప్పు
- అధికంగా మద్యం సేవించడం
- ఒత్తిడి
- అడ్రినల్ మరియు థైరాయిడ్ రుగ్మతలు
- స్లీప్ అప్నియా
ఇలా చేస్తే.. కంట్రోల్..:
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ధూమపానం, ఆల్కహాల్ అధికంగా తీసుకోరాదు. పోషక ఆహారం, బరువు ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని, కంట్రోల్ చేసుకోవడం, ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల రక్తపోటు ను నియంత్రించవచ్చని ప్రముఖ కార్డియాలజిస్ట్ , ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.
డా. చంద్రశేఖర్ కు ఘన సన్మానం:
కర్నూలు హార్ట్ ఫౌండేషన్ నేతృత్వంలో విద్యార్థులకు, ప్రజలకు ఎంతో మంది వైద్య నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహించి…నగర ప్రజల మన్ననలు పొందుతున్న ప్రముఖ కార్డియాలజిస్ట్ , ప్రొఫెసర్ డా. చంద్రశేఖర్ ను సంస్థ గౌరవాధ్యక్షుడు డా. భవాని ప్రసాద్, సభ్యులు చంద్రశేఖర్ కల్కూర తదితరులు ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డా. భవాని ప్రసాద్ మాట్లాడుతూ జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా, కార్డియాలజిస్ట్ వైద్య నిపుణులుగా ప్రజలకు ఎంతో సేవలు అందించిన డా. చంద్రశేఖర్ … మెడికల్ విద్యార్థులకు వివిధ వ్యాధులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా డా. భవాని ప్రసాద్ ఆకాంక్షించారు.