పైపులైన్ల మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలి
1 min readనగరపాలక మేయర్ బి.వై. రామయ్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలో పైపులైన్లు మరమత్తులకు గురైనప్పుడు వాటి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ బి.వై. రామయ్య, సంబంధింత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐదు రహదారుల కూడలిలో జరుగుతున్న పైపులైన్ మరమ్మత్తు పనులను మేయర్ పరిశీలించారు. విఠల్ నగర్, విద్యానగర్, గాంధీ నగర్, మేడం కాంపౌండ్, నంద్యాల గేటు, తదితర ప్రాంతాలకు సంబంధించిన తాగునీటి పైపులైన్ గత రెండు రోజుల క్రితం మరమ్మత్తులకు గురైంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలకు తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడగా, శుక్రవారం సమస్య ప్రదేశాన్ని గుర్తించి, మరమ్మత్తు పనులను అధికారులు, సిబ్బంది పూర్తి చేశారు. ప్రజలకు తాగునీటి సరఫరా అంతరాయం కలగకుండా, దృష్టికి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తూ ఉండాలని సూచించారు. ఇందులో జాప్యం తగదని, మరమత్తు పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని మేయర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిఈఈ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.