అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు పట్టణ,మండల కార్యదర్శులు టి.శివరాం,ఎ.వి.భాస్కర రెడ్డి,అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు సులోచన,సుమలత, యశోద ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు శుక్రవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం నందు సీనియర్ అసిస్టెంట్ నాగన్న కి సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అఖిల భారత కార్మిక సంఘాలు,ఏఐఎఫ్ డబ్ల్యూహెచ్,స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలపై దాడి చేస్తూ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధానాలతో దాసోహం చేస్తున్నదని మన దేశంలో స్వాతంత్రం రాక పూర్వమే బ్రిటిష్ కాలం నుండి కార్మికులు ప్రాణ త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం 1926,వర్క్ మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923,వేతనాల చెల్లింపు చట్టం 1935 తో సహా కనీస వేతనాల చట్టం 1948 తదితర కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక వర్గంపై బానిసత్వాన్ని రుద్దడానికి 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలమైన 4 లేబర్ కోడ్ లను తెచ్చిందన్నారు.ఈ లేబర్ కోడ్ లు కార్మిక హక్కులను కాల రాస్తాయన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని,కనీస వేతనం 26,000 ఇవ్వాలని,గ్రాట్యూటీ జీవో నెంబర్ 8ని మార్పు చేయాలని,పెన్షన్,పిఎఫ్,ఈఎస్ఐ అమలు చేయాలని,మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చుతూ జీవో ఇవ్వాలని,వేసవి సెలవులు ఇవ్వాలని,రైల్వే,విద్యుత్తు,స్టీల్, బ్యాంకులు,ఇన్సూరెన్స్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ విధానాలు ఆపాలని,బాల సంజీవిని యాప్ లో మార్పులు చేయాలని వారు డిమాండ్ చేశారు.