ఉత్తమ డాక్టర్లుగా తీర్చిదిద్దండి..
1 min read
వైద్య విద్య నేర్పే గురువులదే బాధ్యత
- డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్
- అభివృద్ధి, రీసెర్చ్ కు ప్రతి మెడికల్ కాలేజికి రూ. కోటి కేటాయిస్తున్నట్లు వెల్లడి
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు: వైద్య విద్యను అంకితభావంతో నేర్చుకోవాలని, అప్పుడే ఉత్తమ డాక్టర్లుగా ఎదుగుతారని , ఆ విధంగా తీర్చిదిద్దే బాధ్యత విద్య నేర్పే గురువులదేనన్నారు డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్. శుక్రవారం కర్నూలు మెడికల్ కాలేజిని సందర్శించారు. ఆ తరువాత కాలేజీలోని కాన్ఫరెన్స్ హాల్ యందు డా. రఘునందన్ తో కలిసి వివిధ విభాగాల అధిపతులు ప్రొఫెసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. చంద్ర శేఖర్ మాట్లాడుతూ కర్నూలు మెడికల్ కాలేజ్ యందు స్కిల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు , ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ యాదవ్ వైద్య విద్య ప్రక్షాళనకు, ఆసుపత్రుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, అందుకు తగ్గట్టు గా పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. ఆరు నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీలను సందర్శించి రివ్యూ చేస్తామని తెలిపారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజికి రూ. కోటి ..
మెడికల్ కాలేజీలో అభివృద్ధికి రీసెర్చ్ కార్యక్రమాలకు ప్రతి మెడికల్ కాలేజీకి కోటి రూపాయలు కేటాయిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజీలలో అవసరమైన పారామెడికల్ కోర్సులకు ప్రతిపాదనలు పంపాలని వెంటనే అనుమతులు ఇస్తామని తెలిపారు. వైద్య కళాశాలలో సమస్యల పరిష్కారం కొరకు ఈఎంఈ హెల్త్ యూనివర్సిటీ సంయుక్తంగా కళాశాలలో రివ్యూ చేయడం ద్వారా అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడిందని మొదటగా ఆ కార్యక్రమాన్ని కర్నూల్లోనే శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కే చిట్టి నరసమ్మ సూపరిండెంట్ డాక్టర్ నరసింహులు వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సాయి సుధీర్, డాక్టర్ హరి చరణ్, డాక్టర్ రేణుక దేవి, డాక్టర్ విజయ ఆనంద్ బాబు, డాక్టర్ సింధియా శుభప్రద, డిప్యూటీ సూపరిండెంట్ డాక్టర్ శ్రీరాములు, సిడిఎస్ కమిటీ సభ్యులు, ఏపీ ఎమ్ఐ డిసి ఇంజనీర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

