ఆ ఇద్దరి నుంచి ప్రాణహాని : టీడీపీ నేత
1 min readపల్లెవెలుగువెబ్ : తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , డీఎస్పీ విఎస్‌కె చైతన్య నుంచి తనకు ప్రాణ హాని ఉందని టీడీపీ నేత రవీంద్రా రెడ్డి మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి, డీఎస్పీ తనను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వకుండా బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనపై కక్ష్య కట్టి అక్రమంగా కేసులు బనాయించారని, వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా బెంగళూరులో తలదాచుకున్నానని వాపోయారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లకుండా చేస్తున్నారని అన్నారు. రవీంద్రా రెడ్డిని జిల్లా బహిష్కరణ చేయడంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రవీంద్రా రెడ్డి విషయంలో ఎవరూ జోక్యం చేసుకోకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ డీఎస్పీ తనను తాడిపత్రికి రాకుండా అడ్డుకుంటున్నారని రవీంద్రా రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ డీఎస్పీ చైతన్యపై అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులతో విచారణ జరిపించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.