NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నీట్ పరీక్షలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించండి

1 min read

ఎలెక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్ల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో నీట్ పరీక్షల సిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఈ నెల 4వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు (నీట్) పరీక్షలు జిల్లాలో ప్రధమంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్ లను ఆదేశించారు. జిల్లాలో మొత్తం నాలుగు పరీక్షా కేంద్రాలైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బస్టాండ్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్, టేక్కే జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల తదితర కళాశాలలో 1172 మంది విద్యార్థులు నీట్ పరీక్షలకు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు అడ్మిట్ కార్డు, ఆధార్, పాన్, ఓటర్ ఐడి,  డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపు కార్డులతో పాటు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలన్నారు. మ.2.గం.ల నుంచి సా.5.గం.ల వరకు ఆఫ్ లైన్ విధానంలో పరీక్ష జరగనున్నందున ఉ.11 గం.ల నుంచి విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారన్నారు. మ.1.30.గం.ల తరువాత విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రతి పరీక్షా కేంద్రంలో 2 వీల్ చైర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో ఏ ఒక్క చిన్న సంఘటన కూడా జరగకుండా పరీక్షలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. కస్టోడియన్ బ్యాంకుకు వచ్చిన పరీక్ష పేపర్లను పోలీసు సహకారంతో తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలో అభ్యర్థులకు ట్రాఫిక్ వల్ల ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ షాపులు మూసి ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశిండం జరిగిందన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో వైద్య శిబిరాలను కూడా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో చల్లటి తాగునీరు, తగిన వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు. నీట్ పరీక్షల నియమ నిబంధనలను తప్పక పాటించాలని కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రాన్రిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు అత్యంత ఒత్తిడితో నీట్  పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో ఇన్విజిలేటర్లు విద్యార్థుల పట్ల సానుకూలతతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.అనంతరం నీట్ పరీక్షలపై పాటించాల్సిన నియమ నిబంధనల పై జిల్లా కో-ఆర్డినేటర్ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లకు వివరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *