స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలది కీలకపాత్ర
1 min readఅంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థిరమైన అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక అభివృద్ధిని పెంపొందించడంలో సహకార సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. ఐక్యరాజ్యసమితి అధికారికంగా 2025 వ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరం గా (ఐవైసి) సహకార సంస్థ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనే నినాదంతో నెలవారీ లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. ఈ మేరకు జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఐవైసీ స్టేట్ అపెక్స్ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం స్థిరమైన అభివృద్ధిని నడిపించడంలో, గ్లోబల్ సవాళ్ళను పరిష్కరించడంలో సహకార సంఘాలు కీలకమైన పాత్రను పోషిస్తాయన్నారు. జనవరి మాసంలో సహకార విలువలను స్వీకరించే సంవత్సరంగా ప్రారంభిస్తూ అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ తెలిపారు. సహకార క్యాలెండర్ ప్రకారం నెలకు ఒక నినాదంతో అంతర్జాతీయ సహకార ముఖ్య అంశాలు, లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, లింగ సమానత్వం, వాతావరణ చర్యలు, తదితర ఏడు సిద్ధాంతాలతో సత్వరమైన, సమ్మిళిత అభివృద్ధి, ఉత్పత్తులు, సేవల సమృద్ధిని సాధించడమే సహకార సంఘాల లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. సహకార శాఖ, చేనేత, మత్స్యశాఖ, గ్రామీణ అభివృద్ధి, సహకార బ్యాంకులు, తదితర శాఖలు నిర్దేశించిన విధంగా సహకార సంఘాల అభివృద్ధికి దోహదపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.. అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా. బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, డిసిఓ రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.