కూటమితోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి టీజీ భరత్
1 min read
జోహరాపురంలో మంత్రి టీజీ భరత్ ఎన్నికల ప్రచారం
మంత్రికి ప్రజల ఘన స్వాగతం
కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని జోహరాపురంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్నూలు మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష, 22వ వార్డు బీజేపీ అభ్యర్థి భువనా రెడ్డి, 23వ వార్డు టీడీపీ అభ్యర్థి ఆనంద్ బాబు ఈ ప్రచారంలో పాల్గొన్నారు. చైతన్య రథంపై జోహరాపురం అంతటా పర్యటిస్తూ మంత్రి ప్రజలకు అభివాదం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. కర్నూలు నగర ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఆ అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నగర అభివృద్ధికి ముందుకు సాగుతున్నామని తెలిపారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. నగరంలో ఎక్కడ చూసినా ప్రజలు కూటమికి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. జోహరాపురంలో స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి తెలిపారు. 23వ వార్డు టీడీపీ అభ్యర్థి ఆనంద్ బాబు తన దృష్టికి తీసుకొచ్చిన పట్టాల సమస్యను పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అంతకుముందు మంత్రి టీజీ భరత్ 58వ వార్డులో జనసేన కార్పొరేటర్ అభ్యర్థి కిరణ్మయి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరారు.



