పల్లెవెలుగువెబ్ : ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ భయాందోళనలను పుట్టిస్తోంది. కొత్త వేరియంట్ భౌగోళిక ముప్పుగా మారనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యాధి తీవ్రత, లక్షణాలపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఒమిక్రాన్ సోకిన వారిలో డెల్టా వేరియంట్ కంటే భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి బారినపడ్డవారు కొందరు రాత్రిళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నారని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డాక్టర్ తెలిపారు. ఒమిక్రాన్ సోకిన వారు తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురదతో బాధపడుతున్నారని డాక్టర్ ఏంజలిక్ కాట్జీ తెలిపారు.