డాక్టర్ పుల్లన్న సేవలు చిరస్మరణీయం: డా.విజయలక్ష్మి
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లా కురువ సంఘం గౌరవ అధ్యక్షులు కీ .శే .డా .టి .పుల్లన్న సేవలు చిరస్మరణీయమన్నారు లోక్ మాత అహిల్యా బాయి హోల్కర్ శక్తి పీట్ జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి ( బెంగళూరు). ఆదివారం నగరంలోనిఅమీలియో హాస్పిటల్ లో డాక్టర్ పుల్లన్న సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పుల్లన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. డాక్టర్ పుల్లన్న వైద్య వృత్తిలో సేవలు అందించడంతో పాటు కురువ సంఘానికి ఎనలేని సేవలు చేసి సంఘం బలోపేతానికి పాటుపడ్డారని గుర్తుచేసుకున్నారు. శక్తి పీట్ ద్వారా కురువ కులానికి సంబంధించి వైద్య విద్యను అభ్యసిస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు. వైద్య వృత్తిలో రాణిస్తున్న వారికి పురస్కారాలు ప్రదానం చేస్తున్నామన్నారు. త్వరలో ఏపీలో కూడా లోక్ మాత అహిల్యాబాయి హోల్కర్ శక్తి పీట్ కార్యక్రమాలను విస్తృతం చేయబోతున్నామన్నారు. ప్యాన్ ఇండియా కురువ డాక్టర్స్ అసోసియేషన్ పేరుతో డాక్టర్స్ అందరినీ ఒకే తాటిపైకి తీసుకురానున్నామన్నారు.
అమీలియో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ చాపే మాట్లాడుతూ డాక్టర్ పుల్లన్న మరణం కురువ సంఘానికి తీరనిలోటన్నారు. ప్యాన్ ఇండియా కురువ డాక్టర్స్ అసోసియేషన్ కు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్ కే రంగస్వామి మాట్లాడుతూ శక్తి పీట్ ద్వారా వైద్య విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సంఘం ద్వారా డాక్టర్ పుల్లన్న ఆశయాలను సాకారం చేసేందుకు పాటు పడతామన్నారు. అనంతరం డాక్టర్ విజయలక్ష్మిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీహరి, ప్రశాంతి, లింగప్ప తదితరులు పాల్గొన్నారు.