పిఎం సూర్యఘర్ యోజనలో ఏలూరు జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానం
1 min read
ఈపిడీసీఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రధాన మంత్రి సూర్య ఘర్:ముఫ్త్ బిజ్లి యోజన పధకంలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచిందని ఏపి ఈపిడీసీఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు చెప్పారు. 2353 మంది గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ పానెల్స్ ఏర్పాటుచేసుకున్నారని, రాష్ట్రంలో మన జిల్లా ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. గృహ విద్యుత్ వినియోగదారులను పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయని,. ప్రధాన మంత్రి సూర్య ఘర్:ముఫ్త్ బిజ్లి యోజన పధకంలో భాగంగా సోలార్ పానెల్స్ ఏర్పాటకు మెదటి మరియు రెండవ కిలోవాట్ ప్రతి కిలోవాట్ కి రూ.30 వేలు చొప్పున మరియు మూడవ కిలోవాట్ కి రూ.18 వేలు మొత్తంగా మూడు కిలోవాట్ల వరకు గరిష్టంగా రూ.78వేలు రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వటం జరుగుచున్నదన్నారు. జిల్లాలో 12.14 కోట్ల సబ్సిడీతో 2,353 మంది గృహ విద్యుత్ వినియోగదారులు 7.8 మెగావాట్ల సోలార్ పానెల్స్ ఏర్పాటు చేసుకొని నెలకు సుమారు ఒక మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. వినియోగించిన యూనిట్లు పోను మిగులు యూనిట్లకు అదనముగా ప్రతీ యూనిట్ కు రూ.2.09 పైసలు చొప్పున డిపార్టుమెంటు వారు తిరిగి చెల్లిస్తున్నారన్నారు. ఏలూరు జిల్లాలో 5 గ్రామములను అనగా ద్వారకాతిరుమల, దుగ్గిరాల, చిననిండ్రకొలను, తడికలపూడి మరియు ఎర్రంపేట గ్రామములను మోడల్ సోలార్ గ్రామములుగా తీర్చిదిద్దుటకు ప్రయత్నములు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో 27,053 ఎస్.సి మరియు ఎస్.టి. గృహ విద్యుత్ వినియోగదారులను గుర్తించి వారికి ఒక్కొక్క గృహమునకు రెండు కిలోవాట్ చొప్పున మొత్తముగా 54.11 మెగావాట్ రూఫ్ టాప్ సోలార్ పానెల్స్ ఏర్పాటు చేయుటకు నెడ్కాప్ ద్వారా 03-07-2025 తేదిన టెండర్లను ఆహ్వానించటం జరిగిందన్నారు. సౌరశక్తిని వినియోగించడం వలన పర్యావరణ ప్రభావితం చేసే కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా పర్యావరణమునకు ఎంతో మేలు చేసినవారము అవుతామన్నారు. ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద 750 KWp సోలార్ పవర్ ప్లాంటును ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ ఆద్వర్యములో ఏర్పాటు చేసి తద్వారా ద్వారకాతిరుమల పంచాయతీలోని ప్రభుత్వ పంచాయతీ కార్యాలయాలకు మరియు నివాస వినియోగదారులకు ఉచిత విద్యుత్ ను అందజేయటానికి ప్రణాళిక సిద్దం చేయట జరిగిందన్నారు. ప్రధాన మంత్రి కుసుమ పధకంలో భాగముగా ఏలూరు జిల్లాలో పెదవేగి మరియు టి.నరసాపురం మండలంలోని ప్రయోగాత్మకంగా ఇద్దరు వ్యవసాయ విద్యుత్ వినియోగదారులను ఎంపిక చేసి వారికి సోలార్ పానెల్స్ ను ఉచితముగా ఏర్పాటు చేసి ఉచిత వ్యవసాయ విద్యుత్ ను అందించుట జరిగినదని, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు పగటి పూట నాణ్యమైన 9 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్ అందించుటకు గాను ఏలూరు జిల్లాలో 28 వ్యవసాయ విద్యుత్ ఫీడర్లను సోలరైజేషన్ చేసే దిశగా 235.55 ఏకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి అందులో 44 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయుటకు టెండరును ఆహ్వానించటం జరిగిందన్నారు. ఈ టెండరును పారడిగ్మిట్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు ఒక యూనిట్ కు రూ.3.20 పైసలకు అంగీకార పత్రం ఇవ్వటం జరిగిందని ఎస్ఈ సాల్మన్ రాజ్ చెప్పారు.