ఏపీలో తొలిసారిగా యూరోలిఫ్ట్ ప్రొసీజర్
1 min read
విశాఖలోని ఏఐఎన్‌యూ ఆస్పత్రిలో నిర్వహణ
వృద్ధుల మూత్ర సంబంధిత సమస్యలకు విప్లవాత్మక చికిత్స
విశాఖపట్నం, న్యూస్ నేడు : ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖపట్నంలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రిలో 72 ఏళ్ల వృద్ధుడికి యూరోలిఫ్ట్® ప్రొసీజర్ చేశారు. ఆ వృద్ధుడికి అప్పటికే గుండెకు బైపాస్ శస్త్రచికిత్స జరిగింది, ఊపిరితిత్తులకు సంబంధించిన సీఓపీడీ సమస్య ఉంది. ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్యతో ఆరు నెలలుగా మూత్రం సరిగ్గా విడుదల కాక.. క్యాథెటర్ పెట్టించుకునే ఉంటున్నారు. దాన్ని తొలగించేందుకు పలు ప్రయత్నాలు చేసినా అవి విఫలమయ్యాయి. దాంతో ఆయన ఏఐఎన్‌యూ ఆస్పత్రికి రాగా, ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ జి.రవీంద్రవర్మ నేతృత్వంలోని వైద్యబృందం ఈ విప్లవాత్మక చికిత్స చేసింది. ఇందులో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ అమిత్ సాప్లే, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ పి.శ్రీధర్ కూడా పాల్గొన్నారు. రోగి వయసు, గుండె సమస్య దృష్ట్యా మత్తుమందు ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. దాంతో ఆయనకు యూరోలిఫ్ట్® ప్రొసీజర్ చేయాలని నిర్ణయించారు. ఇది కేవలం లోకల్ ఎనస్థీషియాతో చేయగలిగే సురక్షితమైన, సూక్ష్మ శస్త్రచికిత్స (మినిమల్లీ ఇన్వేజివ్) పద్ధతి. ఇందులో సూక్ష్మ ఇంప్లాంట్లను ఉపయోగించి, ప్రోస్టేట్ కణజాలాన్ని మూత్రకోశం నుంచి దూరంగా తీసుకెళ్తారు. దీంతో మూత్రవిసర్జనకు అప్పటివరకు ఉన్న అడ్డంకి తొలగిపోతుంది. పెరిగిన ప్రోస్టేట్ కణజాలాన్ని కత్తిరించక్కర్లేదు, తొలగించక్కర్లేదు. ప్రొసీజర్ అవ్వగానే రోగికి ఇక క్యాథెటర్ అవసరం లేకుండా పోయింది. దాంతో ఆయన జీవననాణ్యత మెరుగుపడింది. ఈ చికిత్సకు నేతృత్వం వహించిన డాక్టర్ రవీంద్రవర్మ మాట్లాడుతూ, “హైరిస్క్ రోగి కావడంతో చికిత్స చాలా సంక్లిష్టమైంది. క్యాథెటర్ అక్కర్లేకుండా యూరోలిఫ్ట్ సిస్టంతో చికిత్స చేయడం చాలా అత్యాధునికమైనది. వృద్ధుల మూత్ర సమస్యలకు ఇది బాగా ఉపయోగపడుతుంది” అని తెలిపారు. డాక్టర్ అమిత్ సాప్లే మాట్లాడుతూ, “యూరోలిఫ్ట్® అనేది వయోవృద్ధుల మూత్రసమస్యలకు అద్భుతమైన పరిష్కారం. అతి తక్కువ సమయంలోనే లక్షణాలు తగ్గిపోతాయి. యుక్త లేదా మధ్యవయసులో వారికి లైంగిక సమస్యలు కూడా ఉండవు. చాలామంది పురుషులకు అది పెద్ద సమస్య” అని చెప్పారు. ఈ కేసు విజయవంతం కావడంతో రాష్ట్రంలో తొలిసారిగా ఏఐఎన్‌యూ విశాఖపట్నంలో అత్యాధునిక యూరాలజీ చికిత్సలు అందుతాయన్న విషయం రుజువైంది.
యూరోలిఫ్ట్ గురించి:
యూరోలిఫ్ట్® సిస్టంకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి ఉంది. ఇది ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ సమస్యను మందులు వాడక్కర్లేకుండా, సంప్రదాయ శస్త్రచికిత్స అవసరం లేకుండా పరిష్కరిస్తుంది. ఇందులో ఇతర ఆప్షన్ల తరహాలో ప్రోస్టేట్ కణజాలాన్ని కత్తిరించాల్సిన అవసరం లేకపోవడంతో రోగులు చాలా త్వరగా కోలుకుంటారు.
