NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రతీ మహిళా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి

1 min read

సర్వికల్ ఆరోగ్యంపై అవగాహన అవసరం

సకాలంలో పరీక్షలతో ప్రాణాపాయం నివారించవచ్చు

డాక్టర్. ఎన్. గీతారాణి

కన్సల్టెంట్ అబ్ స్టెట్రీషియన్ & గైనకాలజిస్ట్,

కిమ్స్ సవీర, అనంతపురం

అనంతపురం, న్యూస్ నేడు:  ఇటీవలకాలంలో మరణిస్తున్న మహిళలు ఏదో రకమైన క్యాన్సర్లకు గురవుతున్నారు. మారుతున్న జీవనశైలి, వాతావరణంలో వస్తున్న మార్పులు, రసాయణాల వినియోగం ఇందుకు కారణమవుతున్నాయి. మహిళకు క్యాన్సర్  అనగానే కేవలం రొమ్ము క్యాన్సర్ లేదా ఇతర క్యాన్సర్ల వస్తాయనే అపోహాలు చాలా మందిలో ఉన్నాయి. ప్రతి మహిళ జీవితంలో ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది. అయితే మహిళల్లో ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడే సమస్యలలో సర్వికల్ ఆరోగ్యం (గర్భాశయ ముఖద్వార ఆరోగ్యం) ఒకటి. ప్రతి సంవత్సరం జనవరి నెలను సర్వికల్ హెల్త్ అవగాహన మాసంగా పాటిస్తున్నారు. దీనివల్ల మహిళల్లో సర్వికల్ క్యాన్సర్‌పై అవగాహన పెంచి, సకాలంలో పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం లక్ష్యం.మొత్తం దేశంలో సర్వికల్ క్యాన్సర్ కేసుల సంఖ్య ఎక్కువగా 50–59 సంవత్సరాల వయసు మహిళలలో కనిపిస్తుంది. కొన్ని అధ్యయనాలు చూపిస్తాయంటే, 40–50 సంవత్సరాల వయస్సులో కూడా కేసులు ఎక్కువగా వస్తున్నాయి.  30 ఏళ్లకు పైగా మహిళలు హెచ్ పి వి వైరస్‌ కారణంగా ప్రమాదం ఎదుర్కొంటారు. ఎక్కువగా కేసులు 40–59 మధ్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 30 సంవత్సరాలకు పైబడిన మహిళలు పరీక్షలు చెయ్యించుకోవాలి.

సర్విక్స్ అంటే ఏమిటి?

గర్భాశయానికి కింది భాగాన్ని సర్విక్స్ అంటారు. ఇది గర్భాశయాన్ని యోనితో కలిపే మార్గం. ఈ ప్రాంతంలో ఏర్పడే మార్పులు కొన్నిసార్లు క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది.

సర్వికల్ క్యాన్సర్ ఎలా వస్తుంది?

సర్వికల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్ పి వి) అనే వైరస్. ఇది సాధారణంగా లైంగిక సంబంధాల ద్వారా వ్యాపిస్తుంది. చాలా సందర్భాల్లో ఈ వైరస్ శరీరం తానే ఎదుర్కొంటుంది. కానీ కొందరిలో ఇది దీర్ఘకాలం ఉండి క్యాన్సర్‌కు దారితీస్తుంది.

లక్షణాలు ఏమిటి?

ప్రారంభ దశలో సర్వికల్ క్యాన్సర్‌కు ఎటువంటి లక్షణాలు ఉండవు. అందుకే ఇది ప్రమాదకరం. అయితే సమస్య పెరిగినప్పుడు ఈ లక్షణాలు కనిపించవచ్చు, నెలసరి కాకుండా రక్తస్రావం,  లైంగిక సంబంధం తరువాత రక్తస్రావం,  దుర్వాసనతో కూడిన యోని స్రావం,  నడుము లేదా కడుపు నొప్పి, ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

సర్వికల్ క్యాన్సర్‌ను ముందే గుర్తించవచ్చా?

అవును. ఇది పూర్తిగా నివారించగలిగే క్యాన్సర్. సమయానికి పరీక్షలు చేయించుకుంటే క్యాన్సర్ రావడానికి ముందే గుర్తించి చికిత్స చేయవచ్చు.

ముఖ్యమైన పరీక్షలు

పాప్ స్మియర్, హెచ్ పి వి పరీక్ష,  21 సంవత్సరాల పైబడిన మహిళలు ప్రతి 3–5 సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

హెచ్ పి వి టీకా ఎంత ముఖ్యము?

హెచ్ పి వి  వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా సర్వికల్ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఈ టీకాను సాధారణంగా 9–14 ఏళ్ల బాలికలకు, అవసరమైతే 26–45 ఏళ్ల మహిళలకు కూడా ఇవ్వవచ్చు (వైద్యుల సూచనతో)

మహిళలు పాటించాల్సిన జాగ్రత్తలు

క్రమం తప్పకుండా స్త్రీల వైద్యులను కలవాలి,  వ్యక్తిగత పరిశుభ్రత,   సురక్షిత లైంగిక అలవాట్లు, పొగతాగడం మానుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలి అలావాటు చేసుకోవాలి.

అవగాహనే రక్షణ

సర్వికల్ క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడమే ఎక్కువ ప్రాణనష్టాలకు కారణం. సిగ్గు, భయం, నిర్లక్ష్యం కారణంగా పరీక్షలు చేయించుకోకపోవడం ప్రమాదకరం. మహిళలు తమ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక చిన్న పరీక్ష మీ జీవితాన్ని కాపాడగలదు.

About Author