PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పోరాట యోధుల.. చరిత్రను వక్రీకరించవద్దు

1 min read
ముత్తుకూరు గౌడప్ప చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వక్తలు

ముత్తుకూరు గౌడప్ప చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వక్తలు

పుస్తకావిష్కరణ సభలో వక్తలు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అసలైన యోధుల చరిత్రలపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. రవి అస్తమించని సామ్రాజ్యాన్ని కలిగిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో మొట్టమొదట పోరాడింది తెర్నేకల్లు ముత్కూరు గౌడప్ప [1801] అని, ఆ తదనంతరం కర్నూలు నవాబు అగు గులాం రసూల్ ఖాన్[1839], ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి[1846~47] అనే విషయం మరిచిపోరాదన్నారు పుస్తక రచయిత డాక్టర్ యాదవ రఘు. ఆదివారం ప్రతిభ మోడల్ స్కూల్ ప్రాంగణంలో డాక్టర్ రఘు యాదవ్ రాసిన తెర్నెకల్లు గ్రామ చరిత్ర అనే పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ఎస్.సి.ఈ.ఆర్.టి ప్రొఫెసర్ షంషుద్దిన్, ప్రతిభ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అరుణాచలం రెడ్డిలు ఆవిష్కరించారు. రాయలసీమ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గంధం అరుణ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. పుస్తక సమీక్ష ప్రముఖ కథరచయిత డాక్టర్ హరికిషన్, ప్రముఖ వ్యాఖ్యాత ఇనయతుళ్ళ చెయ్యగా, ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె. రామాంజనేయులు, బిసి సంఘం నాయకులు శేషుఫణి పాల్గొన్నారు.
గొప్ప.. చారిత్రక ప్రస్థానం..
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్థానిక చరిత్రల నిర్మాణమే దేశ చరిత్ర అని, భారతదేశ చరిత్ర అంటే క్రిందిస్థాయిలో జరిగిన ప్రజా పోరాటాల చరిత్ర అని, అయితే ఇప్పటిదాకా జాతి, కులం, మతం, ప్రాంతం పేరుతో చరిత్ర రచనలో అడుగడుగునా కూడా వక్రీకరణలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రధానంగా స్వాతంత్య్రానంతరం స్థానిక చరిత్రలపై ఎన్నో పరిశోధనలు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇలా గొప్ప చారిత్రక ప్రస్థానం కలిగిన మరియు ఇప్పటిదాకా విస్మరించబడిన గ్రామ చరిత్ర వెలుగులోకి రావడం ఇదే ప్రథమం. ఏదేమైనా ఈ విధంగా దేశస్థాయిలో చరిత్రను గమనిస్తే వెనుకబడిన జాతుల, వెనుకబడిన కులాల మీద అలాగే వెనుకబడినటువంటి ప్రాంతాల మీద ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రజా పోరాటాల చరిత్రకు సముచిత స్థానం కల్పించబడలేదనేది వాస్తవం అని అన్నారు.
గ్రామం ఏకమై.. ప్రాణాలు అర్పించి..
దాదాపు మధ్యయుగాల మొదలుకొని ఆధునికయుగం వరకు కూడా ప్రజా పోరాటాలకు ప్రత్యేకమైన ప్రాంతంగా కర్నూలు జిల్లా ఉంది. అందులో కూడా ప్రత్యేకంగా తెర్నేకల్లు గ్రామానికి తెర్నెకల్లు గ్రామ ప్రజలకు రైతాంగానికి ఒక ప్రత్యేకమైనటు వంటి చరిత్ర. మధ్యయుగాలలో మహమ్మదీయుల దాడులు, మహారాష్ట్రుల దాడులను సైతం గ్రామం గ్రామం ఏకమై మూకుమ్మడిగా ఎదుర్కొని గ్రామస్థులు పోరుసలిపి ప్రాణాలను అర్పించిన దాఖలాలున్నాయిని తెలిపారు.
గౌడప్ప పోరాటం.. ప్రత్యేకత..
అయితే 1800 సంవత్సరంలో రాయలసీమ జిల్లాలు దత్తమండలాల పేరుతో బ్రిటీష్ వాళ్ల అధీనంలోకి వెళ్లినటువంటి నేపధ్యంలో ప్రిన్సిపల్ కలెక్టర్ గా ఈ ప్రాంతానికి సర్ థామస్ మన్రో రావడం జరిగింది. అతడు వచ్చిన వెంటనే ప్రవేశపెట్టిన పన్నుల విధానాలను వ్యతిరేకిస్తూ తెర్నెకల్లు గ్రామంలో ఆంగ్ల అధికారం ప్రారంభమైన వెంటనే ముతుకూరు గౌడప్ప అను గొల్ల కులస్థుడి నాయకత్వంలో గ్రామస్థులందరూ మూకుమ్మడిగా ఒక పెద్ద రైతాంగ పోరాటాన్ని మరియు ఒక ప్రజాపోరాటాన్ని ఆవిష్కరించడం జరిగిందని వెల్లడించారు. ఫలితంగా ఆ గ్రామస్థులు అనేకమంది మరణించారు . ఈ క్రమంలో గౌడప్ప మరియు తెర్నెకల్ గ్రామస్థులు చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని కర్నూలు జిల్లాలో తదనంతర కాలంలో 1839 లో కర్నూలు నవాబు అయిన గులాం రసూల్ ఖాన్​, 1846~47 లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు చేయడం జరిగింది. అయితే తెర్నెకల్లు గ్రామ తిరుగుబాటుకు మిగిలిన తిరుగుబాట్ల కున్న ప్రత్యేకత.. తెర్నెకల్లు గ్రామ తిరుగుబాటు ఒక ప్రజాపోరాటం కాగా గులామ్ రసూల్ ఖాన్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటాలు పాలకవర్గ పోరాటంగా కనిపిస్తాయి.
ధైర్యం..గౌడప్ప సొంతం…
దక్షిణ భారత దేశ చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తే గ్రామం మొత్తం ఏకమై శత్రువులను వ్యతిరేకించి, పోరాడి ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు ఒక్క కర్నూలు జిల్లాలోని తెర్నెకల్ లో తప్ప మరెక్కడా పెద్దగా అగుపించవు. ఏదేమైనాగాని ప్రాచీన యుగంలో ఆది మానవుడి అనవాళ్లును కలిగి, మధ్యయుగాల్లో మొఘల్ సైన్యాలతోనూ, మరాఠా సైన్యాలతోనూ పోరాడిన ప్రజానీకానికి, పెద్దపులిని చంపిన మందనేడు అనుబోయ కులస్థునికి మరియు ఆధునిక యుగంలో ఈస్టిండియా కంపెనీ వారితోనూ పోరాడి అశువులు బాసిన గొల్ల కులస్థుడైన ముతుకూరు గౌడప్ప మరియు బెబ్బే కర్రెన్న వంటి వీరులకి జన్మనిచ్చిన తెర్నేకల్లు గ్రామం ఓ నిరంతరం చారిత్రానుభూతి..
ముత్తుకూరు గౌడప్ప చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వక్తలు

About Author