స్వయం ఉపాధిపై.. దృష్టి సారించండి: బి.వై. రామయ్య
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: యువత స్వయంఉపాధి వైపు దృష్టి సారించి జీవితంలో స్థిరపడాలని నగర మేయర్ బి.వై. రామయ్య గారు పిలుపునిచ్చారు.సోమవారం స్థానిక బిర్లా కాంపౌండ్ లో ఎస్సీ, ఎస్టీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (సిక్కి) కార్యాలయాన్ని బి.వై. రామయ్య గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కాలాన్ని వృధా చేయకుండా స్వయంఉపాధి చేపట్టడం వల్ల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నవారవుతారని అన్నారు. స్వంతంగా తమ కాళ్ల మీద తాము నిలబడాలనుకునే పట్టుదల ఉన్నవారు మరో పది కుటుంబాలకు ఉపాధి కల్పించడానికి దోహదపడతారని అన్నారు. సిక్కి సంస్థ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు సొంతంగా పరిశ్రమలు స్థాపించి ఉపాధి పొందడం అభినందనీయమని అన్నారు. అనంతరం జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తాము అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.సిక్కి సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రాజా మహేంద్రనాథ్ మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగులకు అందుబాటులో ఉండేందుకు కర్నూలులో తమ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తమ సంస్థ కార్యాలయాలు ప్రారంభిస్తున్నామని, నిరుద్యోగ యువత ముందుకొచ్చి తమ సంస్థ సేవలను పొందాలని ఆయన కోరారు.