ఆర్టీసీలో చిన్న ఉద్యోగులపై వేధింపులు సరికాదు
1 min read
వైసీపీ వాసన ఆర్టీసీలో ఇంకా పోలేదు
80 కొత్త సర్వీసులు నిలిచిపోయిన దానికి అధికారుల నిర్లక్షమే కారణం
విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీలో చిన్న స్థాయి ఉద్యోగులు, కార్మికులు సంపద సృష్టిస్తున్నా, వారిపై ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడటం సరికాదని ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీపై వస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న అధికారులు ఇంకా ఆ పదవుల్లో కొనసాగుతుండటం వల్లే ఈ విధమైన సమస్యలు వస్తున్నాయని తెలిపారు. “ఆర్టీసీ సంస్థ బలంగా ఉంది. జనవరిలోనే కొత్తగా 80 బస్సులు రోడ్లపైకి రావాల్సి ఉండగా, రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి ఇప్పటికీ డిపోలకే పరిమితమయ్యాయి” అని అన్నారు. ఆర్టీసీలో నష్టాలకు కారణమైన వారు గత ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులు అని ఆరోపించిన ఆయన, “విజిలెన్స్ డిపార్ట్మెంట్‌కు ఐపీఎస్ అధికారిని నియమిస్తే సంస్థ మరింత నాణ్యతగా ముందుకు పోతుంది” అని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ వర్క్‌షాపులు, స్టోర్స్, ఇతర విభాగాల్లో విజిలెన్స్ నిఘాను పెంచాలని సూచించిన ఆయన, జోనల్ చైర్మన్‌గా తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ స్థలాలను తక్కువ ధరలకు కేటాయించడం, అవినీతి కొనసాగించడంపై తీవ్ర విమర్శలు చేశారు.సాధారణ కార్మికులపై వేధింపులకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంస్థను ఆదుకోవాలంటే, వారి శ్రమను గౌరవించాలి అని రెడ్డి అప్పలనాయుడు అన్నారు.