ఎంఎస్ఎంఈ పార్క్ ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించండి
1 min read
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆర్డీఓలు, తహశీల్దార్లను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంటిగ్రేటెడ్ రూరల్ ఎనర్జీ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ భూముల స్థలసేకరణపై ఆర్డీఓలు, తహశీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, నంద్యాల, ఆత్మకూర్, డోన్ ఆర్డీఓలు విశ్వనాథ్, నాగజ్యోతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్క్ ల ఏర్పాటు కోసం ప్రభుత్వ భూముల స్థల సేకరణ చేపట్టాలని ఆర్డీఓలను, తహశీల్దార్లను ఆదేశించారు. పాణ్యం, సుగాలిమెట్ట ప్రాంతాలలో 50 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, డోన్ మండలం ఉంగరాలగుట్ట ప్రాంతంలో కూడా 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని సంబంధిత ప్రాంతాలలో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాల పై ఎపిఐఐసి జోనల్ మేనేజర్ తో కలిసి పరిశీలించాలని నంద్యాల, డోన్ ఆర్డీఓలను కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఆత్మకూరు మండలంలో కూడా ప్రభుత్వ భూములు 2.5 ఎకరాల మేర ఉంటే పరిశీలించాలని ఆత్మకూరు ఆర్డీఓను ఆదేశించారు.రిలయన్స్ కంప్రెస్సెడ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాలో 5 వేల ఎకరాలను గుర్తించి నివేదికలు ఇవ్వగా అందులో 765 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి రిలయన్స్ సంస్థ నుండి అంగీకారం రావడం జరిగిందన్నారు. అందులో గడివేములలో 300 ఎకరాలు, చాగలమర్రిలో 105 ఎకరాలు, రుద్రవరంలో 190 ఎకరాలు, ఆళ్లగడ్డలో 170 ఎకరాలు ఉన్నాయని, సదరు భూముల్లో ఎలాంటి ఆక్రమణలు వున్నా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.పిఎం కుసుమ్ సంబంధించి పాణ్యం, నంద్యాల, గోస్పాడు, జూపాడుబంగ్లా, భానుముక్కల, ప్యాపిలి మండలాల్లో 10 ఎకరాల మేరకు ప్రభుత్వ భూములు పరిశీలించి సబ్ స్టేషన్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.