ఇండియాలో.. ట్రాఫిక్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చా ?
1 min readపల్లెవెలుగువెబ్ : టర్కీలోని ఇస్తాంబుల్‌లో ట్రాఫిక్ నుంచి విద్యుత్ తయారు చేస్తున్నారు. రోడ్డు మధ్యలో టర్బైన్లను ఏర్పాటు చేసి.. ట్రాఫిక్ నుంచి వచ్చే గాలి ద్వారా టర్బైన్లను తిప్పుతూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని టర్కీలోని ఇస్తాంబుల్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. అయితే ఈ ఆలోచన ఇండియాలో చేస్తే విద్యుత్ ఉత్పత్తిలో మన దేశం ఎక్కడికో వెళ్లిపోతుందని అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర. ట్విట్టర్‌లో చాలా యాక్టివ్ ఉండే ఆయన.. కొత్త విషయాలు, ఆసక్తికర అంశాలతో నెటిజెన్లను ఆకట్టుకుంటూ ఉంటారు. టెక్నాలజీలో కొత్త విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. ఇందులో భాగంగా బుధవారం టర్కీలోని ట్రాఫిక్ నుంచి తీసే విద్యుత్ గురించి ట్వీట్ చేశారు. “ మన దేశంలో ఉన్న ట్రాఫిక్‌ను కనుక ఉపయోగించుకున్నట్లైతే ప్రపంచంలో అత్యంత పవన శక్తి దేశంగా మనమే నిలుస్తాం. గడ్కరీజీ.. మన దేశంలోని హైవేలపైన ఇలాంటివి చేయగలమా?’’ అని ట్వీట్ చేశారు.