కోవిడ్ కట్టడిలో.. రాష్ట్ర ప్రభుత్వం విఫలం
1 min read– బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హిందూ టైగర్ హరీష్ బాబు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోనా వ్యాప్తిని నిరోధించటంలో, సామాన్య ప్రజల కోవిడ్ కష్టాలను తీర్చటంలో, కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ కర్నూలు హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును వ్యతిరేకిస్తూ ఆదివారం నగరంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు మాట్లాడుతూ కోవిడ్–19 రెండవ దశ ఉధృతి గురించి కేంద్ర ప్రభుత్వం పలుమార్లు సమీక్షల ద్వారా ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతూనే ఉందని, రెండవ దశను ఎదుర్కోడానికి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిందన్నారు. కానీ కేంద్రం చేసిన హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, కనీసం అందించిన సహకారాన్ని కూడా అందిపుచ్చుకోకుండా పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని ధ్వజమెత్తారు. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు, PM-CARES నిధుల ద్వారా వెంటిలేటర్లకు నిధులు కేటాయించిందని, ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం .. ప్రైవేట్ ఆస్పత్రులలో కోవిడ్ వైద్య ధరలు నిర్దేశించడమేకాక 50శాతం పడకలు ఆరోగ్య శ్రీ పేషెంట్లకు కేటాయించాలని ఆదేశించినా.. ఎక్కడా అమలు కావడంలేదని, దీంతో సామాన్య ప్రజలు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సరిహద్దులో అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటే… ఏపీ సీఎం పట్టించుకోవడంలేదని విమర్శలు చేసిన వైసీపీ ఎంపీపై దేశద్రోహం కేసు నమోదు చేశారని, ఇక ప్రజల పరిస్థతి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు డా.జి.నాగేంద్ర, ప్రవీణ్ యాదవ్, మోహన్ కృష్ణ నాయుడు , మేఘనాథ్ , సాయి చరణ్ సింగ్ , రాము , వరుణ్ శంకర్, PGR గణేష్ , మరియు బీజేపీ బీజేవైయం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.