కళాశాల భవనాన్ని ఇతర సంస్థలకు కేటాయించడం అన్యాయం
1 min read
ఉర్దూ యూనివర్సిటీని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల భవనంలో ఏర్పాటు చేయకూడదు – బజరంగ్ దళ్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల భవనంలో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు భజరంగ్ దళ్ నేతలు స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం దాతలు స్థలం దానం చేసి, ప్రభుత్వ సహకారంతో కర్నూలు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కళాశాల భవనాన్ని ఇతర సంస్థలకు కేటాయించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ సాయిరాం, నాయకులు శివ సాయినాథ్, గుజరాతీ సురేష్ మాట్లాడుతూ – కళాశాల ఇప్పటికే గదుల కొరతతో ఇబ్బందులు పడుతోందని, కేంద్ర నిధులతో కొత్తగా నిర్మించిన భవనం కూడా పూర్తిగా తగిన వసతులు కలిగి లేదన్నారు. ఉన్నత విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు కళాశాల భవనం ఎదుట నిరసన తెలిపారు.ఉస్మానియా కళాశాలలో గతంలో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం వల్ల అక్కడి పీజీ కోర్సులు మూతపడిన ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఇక్కడ కూడా అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అదనంగా, కళాశాల మైదానం రెండు యూనివర్సిటీల విద్యార్థుల మధ్య వివాదాలకు కేంద్రబిందువవుతుందని పేర్కొన్నారు.సైన్స్ కోర్సులకు అవసరమైన ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలంటే ప్రస్తుత భవనం అవసరమని, కొత్త భవనాన్ని హ్యూమానిటీస్, ఫైన్ ఆర్ట్స్, పీజీ కోర్సులకు వినియోగించాలని వారు సూచించారు. ఉర్దూ యూనివర్సిటీ ప్రస్తుతం పనిచేస్తున్న అద్దె భవనం నవంబర్ 2026 వరకు లీజులో ఉందని, అంతవరకు అక్కడే కొనసాగించడమే సమంజసమని అభిప్రాయపడ్డారు. ఈలోగా ఓర్వకల్లు వద్ద ఉన్న 150 ఎకరాల స్థలంలో స్వంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ఉర్దూ యూనివర్సిటీకి కేటాయిస్తే తీవ్ర ఉద్యమాలు తప్పవని హెచ్చరిస్తూ, ఈ అంశాన్ని విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ దృష్టికి తీసుకెళతామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో భజరంగ్ దళ్ నేతలు తేజ, జయ ప్రకాష్ సింగ్, ఉపేంద్ర నాయక్, నవీన్, మణికంఠ, సంగు రాంబాబు, అర్జున్, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.