జగనన్న కాలనీలు.. ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
1 min read– జేసీ (హౌసింగ్) నారపు రెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న కాలనీలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా నారపురెడ్డి మౌర్య అన్నారు. సోమవారం బిర్లా గేట్ సమీపంలోని సంక్షేమ భవనం ఆవరణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కర్నూలు నందు జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్)గా నారపురెడ్డి మౌర్య నూతన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకాన్ని పకడ్బందీగా… పారదర్శకంగా విజయవంతం చేస్తామన్నారు. మొదటి విడతగా కర్నూలులో 98 వేల ఇళ్ల నిర్మాణం 2022 వ సంవత్సరానికి పూర్తి చేస్తామని, 2023 నాటికి ప్రతి పేద వాడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇంటి నిర్మాణాలలో నిరుపేదలకు ఉపాధి కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.
జేసీకి ఘన స్వాగతం
జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా బాధ్యతలు స్వీకరించిన నారపు రెడ్డి మౌర్యను గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కే వెంకటనారాయణ, హౌసింగ్ డీఈ సత్య రాజు, హౌసింగ్ ఈఈ సి నాగరాజు, మేనేజర్ పి.అప్పారావు ఘనంగా స్వాగతం పలికారు.