ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ‘మెగా పేరెంట్స్ మీట్’ నిర్వహించాలి
1 min read
ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ లో నిర్వహించాలి
పాఠశాలలో సరైన స్థలం లేనివారు బయట విశాలమైన ప్రదేశంలో నిర్వహించాలి
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మెగా పేరెంట్స్ మీట్’ ను జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కూడా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో ప్రైవేట్ పాఠశాలల్లో కూడా’మెగా పేరెంట్స్ మీట్’ ఏర్పాటుపై సోమవారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో సంస్కరణలలో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్(పి టి ఎం) నిర్వహణకు శ్రీకారం చుట్టిందని,జూలై 10 న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటుఎయిడెడ్, ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్, జూనియర్ కళాశాలలో మెగా పిటిఎం 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల విద్యా పురోగతి కోసం ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా తల్లితండ్రుల పాత్ర మెగా పిటిఎంలో కీలకమని, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాలల మద్య బంధాన్ని బలోపేతం చేయడానికి వేదికగా పనిచేస్తోందన్నారు. విద్యా పురోగతి, ప్రవర్తన సామజిక సమస్యల గురించి అవగాహన చేసుకోవడానికి మెగా పిటిఎం ఎంతగానో దోహదపడుతుందన్నారు. జిల్లాలో 1810 ప్రభుత్వ, 558 ప్రైవేట్ పాఠశాలలు మొత్తం 2,368 పాఠశాలల్లోనూ, మరియు 140 జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఆరోజు జరగనున్న కార్యక్రమాలపై విద్యార్థులచే ఇన్విటేషన్ రూపొందించి తల్లితండ్రులకు, ప్రముఖులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా విద్యార్థులచే తల్లితండ్రులు, ప్రముఖులకు స్వాగతం పలకాలని,తల్లితండ్రులు, అమ్మ ప్రాముఖ్యతను తెలియజేసేలా తల్లికి వందనం నిర్వహించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఫోటో సెషన్ నిర్వహించాలన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులతో మొక్కలు నాటించాలని, నాటిన మొక్కలను 3 నెలలపాటు ఆయా విద్యార్థులు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్ అందించడం జరుగుతుందన్నారు. మానసిక ఆరోగ్యం,సైబర్ క్రైమ్ పై అవగాహన, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాలు, పిల్లల పురోగతిపై ఇంటరాక్టివ్ సెషన్లు నిర్వహించాలన్నారు. ‘మెగా పేరెంట్స్ మీట్’ ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు జిల్లాలోని వారి ఇతర బ్రాంచ్ లలో కూడా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, మొక్కుబడిగా కాకుండా పండుగ వాతావరణంలో నిర్వహించాలని, విశాలమైన స్థలం లేని పాఠశాలల వారు బయట విశాలమైన ప్రదేశంలో నిర్వహించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ పాఠశాలలో జరిగే విట్నెస్ ‘మెగా పేరెంట్స్ మీట్’ కార్యక్రమాలకు సంబంధించి ఫోటోలను, 30 సెకండ్ల కు మించకుండా వీడియో లను లీప్ యాప్ లో అప్లోడ్ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకట లక్ష్మమ్మ, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిఓ పంకజ్ కుమార్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ప్రభృతులు పాల్గొన్నారు.
