మినుములు,పెసలు మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
1 min read
మినుములు, పెసలు కొనుగోలుపై జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి సమీక్ష
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో అపరాలుమినుములు మరియు పెసలు కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రి రెడ్డి తెలిపారు. శుక్రవారం స్ధానిక జెసి ఛాంబర్ లో నిర్వహించిన సమీక్షలో సిఎంఎపిపి లో రైతుల నమోదును నూరుశాతం పూర్తిచేయాలన్నారు. గుర్తించిన కొనుగోలు కేంద్రాల్లో భధ్రత, తూకాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. పెసలు క్వింటాకు రూ. 8682/-లు, మినుములు క్వింటాకు రూ.7400/-లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. జిల్లాలోని పెదపాడు, ఏలూరు, దెందులూరు, ముదినేపల్లి, మండవల్లి, కైకలూరు, కలిదిండి మండలాలలో ఈ పంట నమోదు చేసుకున్న రైతుల నుండి మినుములు, పెసలు మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు సమీపంలోని రైతు సేవా కేంద్రాలలో నేటి నుండి సిఎంఎపిపి ద్వారా రైతుల పేర్లు నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. తేమ శాతం 12% లోపు ఉండాలని మరియు రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ కోరారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, ఏ.పి. మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ సిహెచ్ ప్రసాద్ గుప్తా, మార్కెటింగ్ అధికారి వి. మహేంధ్రనాద్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు వై సుబ్బారావు, డిసిఎంఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.