డా. కేవీ సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: దేశంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో నగర శివారులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఫార్మసీ కళాశాలలో ఏర్పాటుచేసిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా నాయకురాలు గీతామాధురి, నిర్మల కిషోర్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు రామస్వామి, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధినేత డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డి, కార్పొరేటర్ శ్రీమతి పద్మలత రెడ్డి తో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్పీకర్ గా వ్యవహరించారు. కార్యక్రమం అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుండే పార్లమెంటు లాంటి అత్యున్నత చట్టసభలపై అవగాహన కల్పించడం అభినందనీయం అన్నారు .దేశంలో రాజ్యాంగాన్ని పార్లమెంటు నడుపుతుందని ఆయన వివరించారు. పార్లమెంటులో దేశానికి అవసరమైన కీలకమైన బిల్లులు ఆమోదించడంతోపాటు దేశ భవిష్యత్తు ఉద్దేశించి అంశాలను చర్చిస్తుందని, ఎక్కడైనా పొరపాట్లు జరిగితే దానిని ఎదిరించేందుకు అవసరమయ్యే నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఈ విషయాన్ని భావిభారత పౌరులు అయిన విద్యార్థులు చిన్నతనం నుంచే తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు.. పార్లమెంటులో అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య జరిగే ఆవేశపూరిత చర్చలపై ప్రజల్లో అపోహలు ఉన్నాయని, వాటిని తొలగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య కేవలం విషయం పరంగా వాదనలు ఉంటాయని, పార్లమెంటు వాయిదా పడిన వెంటనే అందరూ స్నేహితులుగా కలిసిమెలిసి వెలుగుతారని ఆయన వివరించారు. పార్లమెంటులో అధికార పార్టీ నాయకులు ఆవేశంగా మాట్లాడితే వారికి సంబంధించిన కార్యకర్తలు ,ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆవేశంగా మాట్లాడితే వారికి సంబంధించిన కార్యకర్తలు ఆవేశానికి లోనవుతుంటారని, అలాంటి అపోహలకు గురి కావద్దని వివరించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రతి బిల్లుపై కూలంకషంగా చర్చ జరుగుతుందని చెప్పారు. పార్లమెంటులో ప్రతి శాఖకు సంబంధించి స్టాండింగ్ కమిటీ ఉంటుందని, తాను కూడా ఆరు శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేసి సమాధానాలు చెప్పిన వారికి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
