కోవిడ్ నియంత్రణలో మోదీ విఫలం
1 min read– ఏపీసీసీ సాకె శైలజానాథ్
పల్లెవెలుగు వెబ్ ,కర్నూలు: కోవిడ్ సెకండ్ వేవ్ ముప్పు ఉందని తెలిసినా… నియంత్రణలో ప్రధాని నరేంద్రమోదీ విఫలమయ్యారని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. చమురు, నిత్యావసర ధరలు పెంచడంపై ఉన్న ఆసక్తి ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో చూపలేకపోయారని ఆరోపించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక వనరులు, వ్యాక్సినేషన్ వాటాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రాన్ని ధైర్యంగా అడగలేని పరిస్థితిలో ఉన్నారని, కోవిడ్‌తో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. థర్డ్‌వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని నిపుణుల హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి ఉచిత వ్యాక్సినేషన్ విధానాన్ని అమలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని శైలజానాథ్ హితవు పలికారు. సమావేశంలో ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్ కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్ , మాజీ ఎమ్మెల్సీ సుధాకర బాబు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పాలం సుజాత, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎస్ బాబురావు, బి క్రాంతి నాయుడు తదితరులు పాల్గొన్నారు.