రైతుల మేలు కోసమే..నూతన సాగు చట్టాలు: బైరెడ్డి శబరి
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: రైతుల మేలు కోసమే.. నూతన సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు ఏపీ బీజేపీ యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి. నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలంలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాయలసీమ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్వగృహంలో భారత్ బంద్ కు వ్యతిరేకంగా,సాగు చట్టాలకు మద్దతుగా నినాదాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బైరెడ్డి శబరి మాట్లాడుతూ గతంలో రైతులు పండించిన పంటను ఒకే ప్రాంతంలో విక్రయించాలన్న నిబంధన ఉండేదని, కానీ నూతన చట్టాల ద్వారా ఎక్కడైనా విక్రయించే వెసులుబాటు ఉంటుందన్నారు. కానీ దీనిని అర్థం చేసుకోకుండా, కొందరు రాజకీయంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలను ప్రేరేపిస్తూన్నారని ఆరోపించారు. ఆయా రాష్ట్రాల వ్యవసాయ వెబ్‌సైట్లలో సబ్సిడీ యంత్రాలు కనీస మద్దతు ధరను చూపించాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిందని గుర్తు చేశారు.
ఆయా యంత్రాలను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న రైతులకు ఇది ఎంతో లాభదాయకమన్నారు. అధికార వైసీపీ ప్రభుత్వానికి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు సాగు చట్టాలపై కనీసం అవగాహన ఉందా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులకు న్యాయం చేయలేని వైసీపీ ప్రభుత్వం… కేంద్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. సమావేశంలో నందికొట్కూరు బిజెపి అసెంబ్లీ ఇంచార్జ్ కొండేపోగు చిన్న సుంకన్న , కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి గోపాల్ యాదవ్, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కరీం పగిడ్యాల మండలం అధ్యక్షులు నరసింహ, పగిడ్యాల మండల ఉపాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, పగిడ్యాల మండలం కార్యదర్శి రాజు, నంద్యాల పార్లమెంటరీ బిజెవైఎం నాయకులు బైరెడ్డి నవీన్ రెడ్డి, బీజేవైఎం పగిడ్యాల మండల అధ్యక్షులు నాగ స్వామి, బైరెడ్డి శబరి అమ్మ సైన్యం అధ్యక్షులు నాగన్న రైతులు,బిజెపి కార్యకర్తలు, బైరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.