ప్రశ్నించే అవకాశం.. నిలదీసే ధైర్యం కల్పించింది… ఎన్టీఆరే
1 min readఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 39 ఏళ్లు
1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం
పల్లెవెలుగు వెబ్ : ఆత్మగౌరవం మాట దేవుడెరుగు పాలకులకు బానిసల్లా బతకాల్సిన దుస్థితి నుంచి ఎవరినైనా ప్రశ్నించే అవకాశం.. నిలదీసే ధైర్యం కల్పించిన ఘనత స్వర్గీయ ఎన్టీరామారావుదేనని తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు పెనికలపాటి హుమమంతరావు చౌదరి అన్నారు. అతి తక్కువ సమయంలో తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఘనత సాధించిన ఎన్టీఆర్ తెలుగోడి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 39 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన కర్నూలు నగరంలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించి పేదలకు పండ్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సామాన్యుడికి కొండంత ధైర్యం, ఆత్మవిశ్వాసం వచ్చిందనే విషయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ అంగీకరిస్తారని అన్నారు. తెలుగు గడ్డన పుట్టిన రాజకీయ నాయకులందరూ మదరాసీలుగా పరిగణించే పరిస్థితి ఉండేదని.. ఎన్టీఆర్ వచ్చాకనే ఆంధ్రప్రదేశ్ అనే పేరును ఢిల్లీ పాలకులు ఉచ్చరించడమే కాదు.. తెలుగు నేతలను గుర్తించడం నేర్చుకున్నారని వివరించారు. ఇంతటి అపూర్వమైన ఘనతను సాధించిన తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికీ కళలనే నమ్ముకుని, కళలనే జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న కళాకారులతో కలసి సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని హనుమంతరావు చౌదరి పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీమతి లక్ష్మిపద్మ తదితరులు పాల్గొన్నారు.