హంద్రీనీవా ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయాలి…
1 min read
ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేసిన రైతు సంఘాలు
పత్తికొండ , న్యూస్ నేడు: హంద్రీనీవా ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేసి 61,400 ఎకరాలకు సాగునీరు అందించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి. రాజా సాహెబ్ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పందికోన రిజర్వాయర్ ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో రైతు సంఘాల నాయకులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హంద్రీనీవా ప్రాజెక్టు రిజర్వాయర్ ద్వారా 61400 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా, కేవలం 12 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందన్నారు. పందికోన రిజర్వాయర్ కింద ఉన్న కుడి, ఎడమ కాలువలను పూర్తి చేసి సాగు, తాగు నీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకుండా రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేశారన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు నిధులు కేటాయించి 1 లక్ష ఎకరాకు సాగునీరు ఇవ్వాలని కోరారు. కృష్ణానది నీటి యాజమాన్య బోర్డ్ కర్నూల్ లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు శేషాద్రి రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు ఆదినారాయణ రెడ్డి, తిమ్మయ్య, సురేంద్ర కుమార్, కారన్న, సుల్తాన్, పెద్ద ఈరన్న, కారుమంచి, తెర్నేకల్, కైరుప్పల సర్పంచులు అరుణ్, వీరభద్రప్ప, కాశీ విశ్వనాథ్, రామకృష్ణారెడ్డి, శివారెడ్డి, వేణుగోపాల్ ప్రగతిశీల మహిళా అధ్యక్షురాలు మన్నెమ్మ తదితర రైతు నాయకులు పాల్గొన్నారు.