సంక్రాంతి బ్రహ్మోత్సవాలు…
1 min read
శ్రీశైలం, న్యూస్ నేడు: మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహింపబడే సంక్రాంతి బ్రహ్మోత్సవాలు మూడవనాడైన ఈ రోజు (14.01.2026) శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. ఉత్సవాలలో భాగంగానే యాగశాల యందు శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. అనంతరం లోకకల్యాణంకోసం జపాలు, పారాయణలు చేయడం జరిగింది. తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారంగా జరిపించబడ్డాయి. అదే విధంగా ఈ సాయంకాలం ప్రదోషకాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిపించబడతాయి. కైలాసవాహన సేవఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు కైలాసవాహనసేవ జరిపించబడుతుంది ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకారమండపంలో కైలాసవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేకపూజాదికాలు నిర్వహించబడతాయి. తరువాత పురవీధులలో గ్రామోత్సవం జరిపించబడుతుంది. గ్రామోత్సవములో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేయబడింది.
రేపటి కార్యక్రమాలు: ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు (15.01.2026) శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, చండీశ్వర పూజ, మండపారాధనలు, పంచావరణార్చనలు, జపానుష్టానాలు, రుద్రహోమం, సాయంకాలం నిత్య హవనాలు, బలిహరణలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలలో భాగంగా రేపు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ జరిపించ బడుతుంది.
ముగ్గుల పోటీలు: సంక్రాంతి సందర్భముగా రేపు (15.01.2026) మహిళలకు ముగ్గులపోటీలు కూడా నిర్వహించబడుతున్నాయి. ప్రధానాలయగోపురం ఎదురుగా గంగాధర మండపం వద్ద ఈ పోటీలు నిర్వహించబడుతాయి.

