స్కిజోఫ్రెనియా..ఓ మానసిక రుగ్మత..
1 min read
భ్రమలో బతకడం….ప్రవర్తన తీరు మారడం…
- యుక్త వయస్సు నుంచే లక్షణాలు ప్రారంభం
- వ్యాధి గుర్తింపే…ముఖ్యం…
- మందులు…కౌన్సిలింగ్, చికిత్స ద్వారా పూర్తిగా నయం
- ప్రముఖ సైకియాట్రిక్ వైద్యులు డా. సుహృత్ రెడ్డి
- మే 24న ప్రపంచ స్కిజోఫ్రెనియా దినోత్సవం
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు: స్కిజోఫ్రెనియా అనేది మెదడు ఆలోచనా విధానాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక మానసిక రుగ్మత. దీనికి శాశ్వత నివారణ లేనప్పటికీ మందులు, కౌన్సెలింగ్, మరియు కుటుంబ సహాయం ద్వారా లక్షణాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని ఆశా కిరణ్ హాస్పిటల్ సైకియాట్రిక్ వైద్యులు డా. సుహృత్ రెడ్డి స్పష్టం చేశారు. మే 24న ప్రపంచ స్కిజోఫ్రెనియా దినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. యుక్త వయస్సు నుంచి ప్రారంభమయ్యే లక్షణాలను త్వరగా గుర్తించకపోతే .. మానసికంగా… ఆరోగ్యంగా కుంగిపోయే పరిస్థితి నెలకొంటుంది.
లక్షణాలు..
తమలో తాము మాట్లాడటం… భ్రమలో బతకడం… అడిగిన ప్రశ్నకు సంబంధం లేకుండా సమాధానం చెప్పడం… ఇతరులతో మాట్లాడటం కష్టంగా భావించడం, చిన్న విషయాలకు చిరాకు చెందడం…చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉండటం, ఎవరో తనకు హాని కలిగిస్తారనుకోవడం. రెగ్యులర్ పని చేసుకోకపోవడం… స్నానం చేయకపోవడం… తదితర లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యలో ఈ వ్యాధి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లక్షణాలు గుర్తించిన వెంటనే సైకియాట్రిక్ వైద్యులను సంప్రదించాలి.
ఆత్మహత్యాయత్నం…!
స్కిజోఫ్రెనియా ఉన్న వ్యక్తులలో ఆత్మహత్య ఆలోచనలు మరియు ప్రయత్నాలు సగటు కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. బాధితుడు ఆత్మహత్య ప్రమాదంలో ఉన్నాడా… లేక ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నాడా … అనే విషయాలను గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడి వెంటే ఉండాలి.
అపోహాలు వద్దు…
స్కిజోఫ్రెనియా వ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి మాట తీరు, ప్రవర్తన, హావభావాలు చూసిన కుటుంబీకులు, గ్రామీణులు సదరు వ్యక్తికి దెయ్యం పట్టిందని అపోహ పడుతుంటారు. మరికొందరు చేతబడి జరిగిందని, క్షుద్ర పూజలు చేశారన్న సందేహంతో వ్యాధిగ్రస్తుడిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు.
చికిత్స తో.. నియంత్రణ…
మెదడులోని రసాయన అసమతుల్యతను సరిచేయడానికి వైద్యులు సాధారణంగా యాంటిసైకోటిక్ (Antipsychotic) మందులను సూచిస్తారు. వీటిని క్రమం తప్పకుండా వాడడం ద్వారా భ్రమలు, భ్రాంతులు తగ్గుతాయి. అలాగే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (CBT) వంటి థెరపీల ద్వారా రోగి ఆలోచనలను, ప్రవర్తనను మార్చుకోవడంలో సహాయ పడతాయి. అంతేకాక వారికి కుటుంబ సభ్యుల మద్దతు చాలా ముఖ్యం. రోగి పట్ల సానుకూలంగా ఉంటూ.. వారికి అవగాహన కల్పించాలని, ప్రజలు కూడా వ్యాధి పై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సైకియాట్రిక్ వైద్యులు డా. సుహృత్ రెడ్డి వెల్లడించారు.

