పాఠశాలల… పుస్తకాల షాపులా..
1 min read• ఏపీఎస్యూ జిల్లా అధ్యక్షులు బి. భాస్కర్ నాయుడు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: పాఠశాలలను పుస్తకాల షాపులుగా మార్చిన ప్రైవేట్ కార్పోరేట్ స్కూల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ స్టూడెంట్స్ యూనియన్ ఏ.పీ.ఎస్.యు జిల్లా అధ్యక్షులు బి భాస్కర్ నాయుడు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లోని డీఈఓ సాయిరాంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ నాయుడు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని పుస్తకాలు విక్రయిస్తున్న పలు కార్పొరేట్ పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నత ప్రమాణాలతో విద్యను బోధిస్తామని ప్రకటనలు గుప్పించిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వలలో పేద, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు చిక్కుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాలు, యూనిఫాం, ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఆయా పాఠశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఏపీఎస్యూ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.