మెగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ ద్వారా బడిఈడు పిల్లలను బడిలో చేర్పించాలి
1 min read
ఏలూరులోని వెంకట్రావుపేట నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో మెగా ఎన్రోల్మెంట్
విద్యార్థుల ప్రవేశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: అంగన్వాడీ లలో ప్రీ స్కూల్ పూర్తి చేసుకున్న పిల్లలను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏలూరులోని వెంకట్రావుపేట నగరపాలక సంస్థ ప్రాధమిక పాఠశాలలో మెగా ఎన్రోల్మెంట్ లో విద్యార్థుల ప్రవేశాలను బుధవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలు,వారి తల్లితండ్రులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులు అయిన ఉపాధ్యాయులు, ఉచిత పాఠ్యపుస్తకాలు మరియు నోటు పుస్తకాలు, ఉచిత యూనిఫారాలు, డిజిటల్ క్లాసు రూమ్లు, నాణ్యమైన బోధన మరియు ఇంగ్లీష్ మీడియం, మధ్యాహ్న భోజనపథకం, క్రీడా స్థలాలు,క్రీడా పరికరాలు,వంటి ఎన్నో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయని తల్లితండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలలోని ప్రీ స్కూల్ నుండి 5 సంవత్సరాల వయస్సు దాటిన 7600 మంది చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యలో మానివేసిన విద్యార్థులను గుర్తించి, వారి తల్లితండ్రులతో మాట్లాడి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఐదు సంవత్సరాల వయస్సు నిండి అంగన్వాడీ ప్రీ స్కూల్ నుండి తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలలో చేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, జిల్లాలో మెగా డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు తెలియజేసి బడి బయట పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సదుపాయాలపై విద్యా శాఖ ముద్రించిన కరపత్రాలను పిల్లల తల్లితండ్రులకు కలెక్టర్ పంపిణీ చేశారు. డిఈఓ వెంకటలక్ష్మమ్మ, సమగ్ర శిక్ష ఏపిడి డా:పంకజ్ కుమార్, ఐసిడిఎస్ పీడీ శారద, సమగ్ర శిక్ష అధికారులు ఎస్. నాగేశ్వరరావు,బి.భాస్కర రాజు,తహసీల్దార్ గాయత్రి,ఎంఈఓ లు వి.శ్రీనివాసరావు,అరుణ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. రాజేశ్వరి, ప్రభృతులు పాల్గొన్నారు.


