ప్రగతి పనులను వేగవంతం చేయండి..
1 min read
నగరపాలక అధికారుల సమీక్ష మంత్రి టీ.జీ. భరత్
రహదారుల పనుల్లో జాప్యం చేయోద్దు
పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
తాగునీటి సరఫరా మరింత మెరుగుపరచండి
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం నగరంలో ప్రగతి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీ.జీ. భరత్ అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు, అన్ని విభాగాల అధికారులతో నగరాభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు సంబంధించి రహదారుల నిర్మాణ పనుల్లో జాప్యం చేయోద్దని పేర్కొన్నారు. రాజ్‌వీహర్ సమీపంలో హంద్రీ ఒడ్డున బండ్ రోడ్డు, మెడికల్ కాలేజీ వద్ద మలుపు విస్తరణ, రెండోవ పోలీసు పటాలం నందు బైపాస్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పాతబస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, వినాయక ఘాట్ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కి ఇబ్బంది కలిగిస్తూ, రహదారులను ఆక్రమించిన తోపుడు బండ్లను తొలగించాలని ఆదేశించారు. కిడ్స్ వరల్డ్ కూడలి అభివృద్ధి చేయాలని, స్కాడ వ్యవస్థ పటిష్టంగా నిర్వహించాలని, స్పీడ్ బ్రేకర్లకు వాహనదారులు గుర్తించేలా రంగులు వేయాలని సూచించారు. తాగునీటి సరఫరా రాత్రివేళల్లో కాకుండా, సాధ్యమైనంత వరకు పగటిపూటే సరఫరా చేయాలని ఆదేశించారు. శివారు ప్రాంతాల్లో సైతం తాగునీటిని అందించాలని పేర్కొన్నారు. తాగునీటి సరఫరాపై ఫిర్యాదు రాకూడదని స్పష్టం చేశారు. పార్కుల అభివృద్ధికి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. శంకుస్థాపనలు చేసిన రహదారులు, మురుగు కాలువలు, మరుగుదొడ్లు వంటి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పూడికతీత పనులు మరింత వేగవంతం చేయాలని సూచించారు. దోమల సమస్య పరిష్కరించాలని, కుక్కల బెడద నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, 107 బహిరంగ మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నగరంలో ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని, తమ ఫ్యాక్టరీ నుండి హైపో ద్రావణం ఉచితంగా అందజేస్తున్నామని, వాటి ద్వారా దోమల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వేసవిలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూసుకుంటున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కే.విశ్వేశ్వర్ రెడ్డి, ఎస్ఈ రాజశేఖర్, సిటి ప్లానర్ ప్రదీప్, ఆర్ఓ జునైద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, సూపరింటెండెంట్లు రామక్రిష్ణ, స్వర్ణలత, మంజూర్ బాష, వెటర్నరీ డాక్టర్ మల్దన్న, తదితరులు పాల్గొన్నారు.