నన్నారి సాగును చేపట్టండి….
1 min read
గిరిజన స్టోర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
బైర్లూటి/నంద్యాల, న్యూస్ నేడు: నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రతి చెంచు కుటుంబం నన్నారి సాగును చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని బైర్లుటీ చెంచు గూడెంలో నన్నారి నర్సరీ ప్లాంట్ ను కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకట శివప్రసాద్, సర్పంచ్ గురువమ్మ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతంలో అంతరించిపోతున్న నన్నారి సాగును ప్రతి చెంచు కుటుంబం చేపట్టాలన్నారు. ఈ మొక్కను తీసుకురావాలంటే గిరిజనులు అడవిలో చాలా దూరం వెళ్లాల్సి ఉంటుందన్నారు. సేకరించిన మొక్కలను దళారుల ఒక కేజీ 500 రూపాయలు చొప్పున కూడా అమ్మడం జరుగుతోందన్నారు. తాను నన్నారి నర్సరీ గురించి తెలుసుకొని రావడం జరిగిందని ప్రతి ఒక్క చెంచు గిరిజన కుటుంబం ఒక ఎకరంలోనైనా నన్నారి సాగును పెంచేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.గతంలో గిరిజన స్టోర్ ఉండేదని… అందులో అటవీ ఉత్పత్తులైన కుంకుడు, చింతపండు, ముష్టి గింజలు, ఉసిరి, కరక్కాయలు తదితరాలను అమ్ముకునే వారమని గిరిజన స్టోర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కలెక్టర్ కు నివేదించగా తక్షణమే గిరిజన స్టోర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కలెక్టర్ ఆదేశించారు. నన్నారి నర్సరీలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించి బాగా చేశారని ఇంకా బాగా చేయాలని కలెక్టర్ ప్రోత్సహించారు. PMVDVK ద్వారా గ్రూపులు ఏర్పాటు చేసి వారిని చైతన్యవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుబ్రమణ్యం, ప్రాజెక్టు మేనేజర్ కేజీ నాయక్, హౌసింగ్ ఏఈ, ఉపాధి ఏపీఓ, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.