చెయ్యేరు ఉగ్రరూపం.. 30 మంది గల్లంతు
1 min read
పల్లెవెలుగు వెబ్: కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజంపేట సమీపంలోని అన్నమయ్య జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట కొట్టుకుపోయింది. దీంతో జలాశయం నుంచి వరద నీరు ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాలను ముంచెత్తింది. గుండ్లూరు, పులపత్తూరు, శేషమాంబపురం, మందపల్లి గ్రామాలు నీటమునిగాయి.
చెయ్యేరు నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో నందలూరు, ఆకేపాడులలో సుమారు 30 మంది చెయ్యేరు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోపక్క రాజంపేట, నందలూరు మధ్య అస్తవరానికి సమీపంలో రైల్వే ట్రాక్ కిలోమీటరు మేర కొట్టుకుపోయింది. అలాగే నందలూరు వద్ద మూడు మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికితీశారు. భారీ వర్షాల కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.