PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

న్యాయం జరిగేంతవరకు పోరాటం ఆపేది లేదు…

1 min read

– బీసీ మహిళలు కురువ సుగుణమ్మ మరియు లక్ష్మీ లకు వెంటనే న్యాయం చేయాలి

– కమ్మ వెంకటేశ్వర్లు, అల్లుడు డీఎస్పీ యుగంధర్ బాబు మోసాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుంది.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  బీసీ మహిళలు కురువ సుగుణమ్మ మరియు లక్ష్మీలకు వెంటనే న్యాయం చేయాలని కమ్మ వెంకటేశ్వర్లు అతని అల్లుడు డి.ఎస్.పి యుగంధర్ బాబు మోసాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం న్యాయం జరిగేంతవరకు ఆపేది లేదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు. కర్నూలు నందలి స్థానిక కలెక్టరు కార్యాలయం ముందు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో కురువ సుగుణమ్మ మరియు లక్ష్మీలకు న్యాయం చేయాలని చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుల ప్రజా విద్యార్థి యువజన మరియు మహిళా సంఘాల ప్రతినిధులు పట్నం రాజేశ్వరి ఎం.కె రంగస్వామి, శేషఫణి, సిపిఐ నాయకులు జగన్నాథం, మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి , నాయకంటి జయన్న , సంచార జాతుల ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రుద్రాక్షల ఇందిరాదేవి, సంచార జాతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది శ్రీనివాసులు, కుళ్లాయప్ప, రవికుమార్, భరత్ కుమార్ ఆచారి, బత్తిన కిరణ్ కుమార్, యాట ఓబులేషు, ఎరుకలి రాజు, కురువ సంఘం నాయకులు శ్రీనివాసులు, కె.సి.నాగన్న, మహానంది, న్యాయవాది లక్ష్మన్న ఎమ్మార్పీఎస్ నాయకులు కిరణ్ కుమార్ మాదిగ, రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న, తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ డీఎస్పీ స్థాయి అధికారి అయి ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం సరైనది కాదని వ్యాపారం ముసుగులో డిఎస్పి యుగంధర్ బాబు అతని మామ వెంకటేశ్వర్లు కలసి సుగుణమ్మను మరియు లక్ష్మీలను మోసం చేసి దాదాపు కోటి రూపాయలు దండుకోవడం ఎంతవరకు సమంజసం అని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆమె ప్రశ్నించారు. భూమి కొనుగోలు పేరుతో మహిళలను మోసం చేసి కోట్ల రూపాయలు నష్టం చేసినటువంటి మామ అల్లుళ్ళ దౌర్జన్యాన్ని, మోసాన్ని, కుట్రలను కుల ప్రజా మహిళా సంఘాలు ఎండగడుతుంటే జిల్లా పోలీసు ఉన్నతాధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధాకరమని ఆమె అన్నారు. అనంతరం బిసి జనసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు శేషఫణి మాట్లాడుతూ ఇది వ్యక్తిగత సమస్య కాదని బీసీ మహిళల ఆత్మగౌరవ సమస్యని వెనుకబడిన వర్గాల మహిళలను ఆధిపత్య కులాలకు చెందినటువంటి కమ్మ వెంకటేశ్వర్లు అతని అల్లుడు డిఎస్పి యుగంధర్ బాబుల ధన అహంకారానికి కుల అహంకారానికి బిసి మహిళలు బలైన సంఘటనకు నిదర్శనమని ఆయన అన్నారు. ఆధిపత్య కులాల పెత్తనాన్ని మోసాన్ని సహించే రోజులు పోయాయని వెంకటేశ్వర్లు అతని అల్లుడు డిఎస్పి యుగంధర్ బాబు తెలుసుకోవాలని ఆయన అన్నారు. కురువ సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కె. రంగస్వామి మాట్లాడుతూ కురువ సుగుణమ్మకు ఇవ్వాల్సినటువంటి 62 లక్షల రూపాయలను వడ్డీతో సహా వెంకటేశ్వర్లు తక్షణమే చెల్లించాలని ఆయన అన్నారు. సిపిఐ నాయకులు జగన్నాథం మాట్లాడుతూ డిఎస్పి యుగంధర్ బాబు తన మామ వెంకటేశ్వర్లకు చెప్పి బాధిత మహిళలకు న్యాయం చేయాలని లేని పక్షంలో యుగంధర్ బాబు ఇంటి ముందు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత మహిళలు కురువ సుగుణమ్మ లక్ష్మీ మరియు పర్ల గ్రామ ప్రజలు మహిళా ఐక్య వేదిక సభ్యులు, కురువ సంఘం నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.

About Author