కరువు నేలలో కష్టపడి పండించిన గడ్డివాములు బుగ్గిపాలు
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: కరువు నేలలో పశువుల మేత కోసం కష్టపడి పండించిన పశుగ్రాసం బుగ్గిపాలైన ఘటన పత్తికొండ మండలం చందోలి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని చందోలి గ్రామంలో అదే గ్రామానికి చెందిన రోషన్న కొడుకు పుల్లయ్య , ధూపాల మద్దిలేటి, అనే రైతులు పశుగ్రాసాన్ని వాముదొడ్లలో నిల్వ చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివాముకు నిప్పు పెట్టారు. దీంతో మంటలు ఒక్కసారిగా అధికమయ్యాయి. అక్కడే ఇండ్ల లో ఉన్న వారు గమనించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పత్తికొండ పట్టణం నుంచి అగ్నిమాపక వాహనాలు, సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. అప్పటికే పశుగ్రాసం మొత్తం కాలిపోయింది. దీంతో సుమారు రూ.2లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం గాని ఎవరైనా దాతలు ముందుకు ఆ రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.