తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుంది..
1 min read
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
ఎమ్మెల్సీ బిటి నాయుడు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్‌లో తెదేపా నేత బిటి నాయుడుకు రెండవ సారి ఎమ్మెల్సీ పదవి వచ్చిన సందర్భంగా ఏర్పాటుచేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురూ కలిసిమెలిసి ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సైతం కలిసి పని చేయాలన్నారు. ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఉంటాయని.. కలిసి పరిష్కరించుకోవాలన్నారు. 2047 విజన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారన్నారు. సుదీర్ఘకాలం మన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశంలోనే క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. పార్టీలో ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడితే సహించమని.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీలో కష్టపడిన వారందరికీ పదవులు వస్తాయని.. ఓపిక, సహనంతో ఉండాలని చెప్పారు.కర్నూల్లో బీసీ భవన్ కోసం అప్పటి టిడిపి ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో దాని నిర్మాణం జరగలేదన్నారు. ఇప్పుడు మళ్లీ తమ ప్రభుత్వంలో బీసీ భవన్ నిర్మాణం కోసం తాను కృషి చేస్తానని చెప్పారు. వివిధ హోదాల్లో ఉన్న నాయకులు కూడా ఇందు కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.
