NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జలాలే మన సంపద..

1 min read

నీటి విలువ తెలిసిన వాణ్ని కాబట్టే కృష్ణమ్మకు హారతి ఇచ్చా

జూలై మొదటివారంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభపరిణామం

కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన సీఎం…గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల

శ్రీశైలం, న్యూస్​ నేడు    : పూర్వీకులు మనకి సనాతన ఆలయాల్ని వారసత్వంగా ఇచ్చారు. కానీ అందరికీ అవసరమైన ఆధునిక దేవాలయాలు రిజర్వాయర్లు, జలాశయాలు. అటువంటి ఆధునిక దేయాలయాలను రాష్ట్రంలో అత్యధికంగా నిర్మించే అవకాశాన్ని నాకు భగవంతుడు కల్పించాడు. జలాలే మన సంపద.. వాటితోనే రైతుల కష్టాలు తీరతాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు గేట్లు నాలుగు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం నీటి వినియోగదారులతో సమావేశమై ప్రసంగించారు.

నిండిన ప్రాజెక్టును చూస్తే మనసు ఆహ్లాదంగా ఉంది

‘నా జీవితంలో ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. జూలై నెలలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండింది.  నిండుకుండలా మారిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తుంటే మనసు ఆహ్లాదంగా ఉంది. నేను నీటి విలువ తెలసిన వాడిని కాబట్టే కృష్ణమ్మకు జల హారతి ఇచ్చా. భవిష్యత్తులో నీటి కొరత ఉండకుండా ఉండేందుకు కృష్ణమ్మకు హారతి ఇచ్చాను. జూలైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండటం శుభపరిణామం. నీటితో రాయలసీమ జలాశయాలన్నీ కళకళ్లాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 215 టీఎంసీల నింపొచ్చు. రోజుకు 17 టీఎంసీల చొప్పున వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ కూడా నిండింది.’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 

గంగమ్మను పూజిస్తే కరవు ఉండదు

‘భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకుని నా సంకల్పం నెరవేరాలని మొక్కుకున్నా. రాయలసీమ రతనాలసీమగా మార్చాలని వేడుకున్నాను. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నాను. నీళ్లు మన సంపద..జలాలుంటే సందప సృష్టించుకోవచ్చు. శ్రీశైలం పవిత్రమైన పుణ్యక్షేత్రం… శక్తి పీఠం. మల్లికార్జున స్వామి చల్లగా చూసినన్ని రోజులు రాయలసీమ సుభిక్షంగా ఉంటుంది. శ్రీశైలం పేరు వినగానే మల్లన్న, రిజర్వాయర్ గుర్తొస్తాయి. దేవుణ్ని పవిత్రంగా ప్రార్థించిన విధంగానే నీళ్లను కూడా పూజిస్తే రైతులకు కష్టాలు ఉండవు. గతంలో కరవు వల్ల రాయలసీమను ఎవరూ కాపాడలేరు, రాళ్లసీమగా మారుతుందని ఆశలు వదలుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చని ఎన్టీఆర్ నిరూపించారు. రతనాల సీమగా చేస్తానని చెప్పి ఉక్కు సంకల్పంతో ముందుకెళ్తున్నాం’ అని అన్నారు. 

ప్రజలే ప్రత్యక్ష దేవుళ్లు :

‘రైతులు ముందుకొస్తే పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తాం. ఉత్పత్తి అయిన విద్యుత్తులో రైతులు వినియోగించుకోగా మిగిలింది ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. నేను తెచ్చే ప్రతి విధానం ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికే. జలాశయాలన్నీ నీళ్లతో నిండాలని, పుష్కలంగా నీరు అందుబాటులో ఉండాలని మల్లికార్జునస్వామిని కోరుకుంటున్నా. పరోక్షంగా వరాలు ఇచ్చేది దేవుడు…ప్రత్యక్షంగా సహకరించేది ప్రజా దేవుళ్లు. మంచి పనులకు కులం, మతం, ప్రాంతం అడ్డం రాకూడదు. ఏ ప్రభుత్వ విధానాల వల్ల మీకు మంచి జరుగుతుందో చూసుకుని మద్ధతుగా నిలిస్తే మీ పిల్లల భవిష్యత్ బాగుంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *