ఆర్ఆర్ఆర్ జపాన్ టార్గెట్ ఎంతంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో విడుదల కానుంది. దీని కోసమే ప్రత్యేకంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి ఆ దేశానికి వెళ్లి అక్కడి మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఈవెంట్లలో పాల్గొనడం చేస్తున్నారు. సరే ఇంతకీ ఆర్ఆర్ఆర్ జపాన్ టార్గెట్ ఎంతనే ఆసక్తి కలగడం సహజం. ఇప్పటిదాకా ఆ దేశంలో అత్యధికంగా కలెక్ట్ చేసిన సినిమా రజనీకాంత్ ముత్తు. అది 400 మిలియన్ యెన్లు(జపాన్ కరెన్సీ) వసూలు చేసింది. ఒక యెన్ మన లెక్కలో అర్ధరూపాయిపైన యాభై పైసలు ఎక్కువ. అంటే సుమారుగా ఇరవై రెండు కోట్ల దాకా ఉంటుంది. తర్వాత స్థానంలో బాహుబలి 365 మిలియన్ యెన్లు, త్రీ ఇడియట్స్ 149 మిలియన్ యెన్లతో ఉన్నాయి.
టాప్ టెన్ లో శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లీష్, సాహో, సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్ తదితరాలు ఉన్నాయి. వీటిలో ఆర్ఆర్ఆర్ ప్రస్తుతానికి బాహుబలిని దాటాలనే టార్గెట్ ని పెట్టుకుంది. ఆ ఛాన్స్ లేకపోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అవకాశాన్ని వదిలి పెట్టకూడదనే ఉద్దేశంతో రాజమౌళి ఏకధాటిగా ఆర్ఆర్ఆర్ ని ప్రమోట్ చేయడం ఆపడం లేదు. ఇండియాలో ఇంతకంటే ఎక్కువ వసూలు చేసిన కెజిఎఫ్ 2 ఎప్పుడో సైలెంట్ కాగా జక్కన్న బృందం మాత్రం నాన్ స్టాప్ గా పని చేస్తూనే ఉంది. ఒకవేళ జపాన్ లో కనక ట్రిపులార్ బ్లాక్ బస్టర్ అయితే ఆ వసూళ్లు కలుపుకుని భారతదేశపు అతి పెద్ద బ్లాక్ బస్టర్ పేరు మనకే వస్తుందనడంలో నో డౌట్.