రెండేళ్లలో ఊహించని అభివృద్ధి చేశాం
1 min read
కర్నూలును పారిశ్రామికంగా ముందుకు తీసుకెళుతున్నాం
రెండవ రోజు మహానాడులో మంత్రి టీజీ భరత్ గుప్తా
కర్నూలు, న్యూస్ నేడు: తమ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో రాష్ట్రంలో ఊహించని విధంగా అభివృద్ధి చేశామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. రెండవ రోజు నగరంలోని వివిధ క్లస్టర్లలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ దేశం గర్వించదగ్గ నాయకుడు అన్నారు. ఆయన అమలు చేసిన పథకాలు దేశానికే ఆదర్శవంతంగా నిలిచాయన్నారు. తెలుగు జాతి ఎన్టీఆర్‌ను ఎన్నటికి మర్చిపోదని కొనియాడారు. ఇక ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వంలో పేదలకు అన్నివిధాలా అండగా ఉంటున్నామన్నారు. పింఛన్ల పంపిణీ, తల్లికివందనం పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతాయన్నారు. అన్న క్యాంటిన్ ద్వారా పేదల కడుపు నింపుతున్నట్లు తెలిపారు.కర్నూలు అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. మునుపెన్నడూ లేనివిధంగా ఓర్వకల్లుకు భారీగా పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు చెప్పారు. రూ.50 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదలకు ఎంతో ఉపయోగపడే కర్నూలు ప్రభుత్వాసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానన్నారు. కర్నూలును స్మార్ట్ చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నానన్నారు. నగరంలో ఇప్పటివరకు 850పైగా కొత్త విద్యుత్ స్తంభాలు అమర్చినట్లు చెప్పారు. 40కి పైగా ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చామన్నారు. సమస్య ఉందని తెలిసిన వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు. గతంలో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై పోరాడినట్లు తెలిపారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వై.ఎస్ జగన్ చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వ పాలన అరాచకంగా సాగిందని, ప్రజలు మెచ్చేవిధంగా తమ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. పుట్టినరోజులకు సేవా కార్యక్రమాలు చేసే సంస్కృతి తమదైతే.. రోడ్లపై ఫ్లెక్సీలకు పొట్టేళ్ల రక్తం చిందించేది వైసీపీ నైజం అన్నారు. వైసీపీ విధానాలు ప్రజలందరికీ అర్థమవుతున్నాయన్నారు.


