NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు

1 min read

తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ప్రతీక ఎన్టీఆర్ – డిఆర్ఓ రాము నాయక్

నంద్యాల, న్యూస్​ నేడు: నటసార్వభౌముడు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలు గురువారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, జిల్లా పర్యాటక అధికారి విజయలక్ష్మి తదితర అధికారులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ రాము నాయక్ మాట్లాడుతూ.. తెలుగు సినీ, రాజకీయ రంగాలలో ఎన్టీఆర్ గారు సృష్టించిన ప్రభంజనం చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. వెండితెరపై తన అపూర్వ నటనతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఎన్టీఆర్, రాజకీయాల్లో ప్రజాహిత పాలనతో తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచాయని తెలిపారు. ముఖ్యంగా శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి దైవిక పాత్రల్లో ఆయన నటన ప్రజల హృదయాల్లో దైవసమాన స్థానం సంపాదించిందన్నారు. ఏ పాత్ర పోషించినా దానిలో జీవించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల మహానటుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.1923 మే 28న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన ఎన్టీఆర్  సాధారణ కుటుంబం నుంచి వచ్చి తన అసాధారణ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచారని తెలిపారు. ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కళారంగాన్ని ఎంచుకోవడం ఆయన సంకల్పబలానికి నిదర్శనమన్నారు. 1949లో విడుదలైన “మనదేశం” చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఎన్టీఆర్ , అనంతరం అనేక చారిత్రక, పౌరాణిక, సామాజిక చిత్రాలలో అజరామర పాత్రలు పోషించి తెలుగు చలనచిత్ర చరిత్రలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా కూడా తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహానుభావుడు ఎన్టీఆర్ అని డిఆర్ఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *