ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా సేవలందిస్తా
1 min read
– ఆదోని నూతన ఆర్డీవో కె. అరుణ దేవి
ఆదోని రెవెన్యూ డివిజన్ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారిగా బాధ్యతల స్వీకరణ
ఆదోని, న్యూస్ నేడు: ఆదోని రెవెన్యూ డివిజన్ నూతన రెవెన్యూ డివిజనల్ అధికారిగా (ఆర్డీవో) కె. అరుణ దేవి శుక్రవారం ఉదయం 9.00 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు, ఉద్యోగులు, రెవెన్యూ శాఖ సిబ్బంది, రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆర్డీవో కె. అరుణ దేవి మాట్లాడుతూ.., ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సకాలంలో, పారదర్శకంగా చేరేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. డివిజన్ పరిధిలో కొనసాగుతున్న రీ-సర్వే పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేసేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ అమలుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక పరిపాలన అందించడమే తన లక్ష్యమని, అధికారులు, సిబ్బంది సమిష్టి సహకారంతో ఆదోని రెవెన్యూ డివిజన్‌కు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తానని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయపు పరిపాలన అధికారి నవీన్ కుమార్, ఆదోని తహసీల్దార్ శేషఫణి, తహసీల్దార్ రజనీకాంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది, రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగులు మరియు ఇతరులు పాల్గొని నూతన ఆర్డీవోకు శుభాకాంక్షలు తెలియజేశారు.

