జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేత
1 min read
కుమార్తెల విద్యాభ్యాసానికి ముఖ్యమంత్రి చేయూత
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9వ తేదీన బనగానపల్లె పర్యటన సందర్భంగా విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం కోరిన కుటుంబానికి మంజూరు చేసిన రూ.2 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పేద మరియు అవసరమైన కుటుంబాల పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి అన్ని విధాలా అండగా నిలుస్తోందన్నారు. ఈ నెల 9న బనగానపల్లె మండలంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొన్న సందర్భంగా బేతంచర్ల మండలం గూటుపల్లె గ్రామానికి చెందిన కాదారమ్మ లక్ష్మి తన కుమార్తెల విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.ఆ వినతిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, కుమార్తెల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తూ తక్షణమే అవసరమైన సహాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుమార్తెల విద్యాభ్యాసం కోసం రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల కుటుంబానికి అందజేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. విద్య ద్వారానే కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతాయని, ప్రతి విద్యార్థి తన లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం అవసరమైన సహకారాన్ని అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి డి. రాము నాయక్, డోన్ ఆర్డీఓ నరసింహులు, బేతంచర్ల తహశీల్దార్ నాగమణి తదితర అధికారులు పాల్గొన్నారు.

