పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలను డిసెంబర్ లోగా పూర్తిచేయాలి…
1 min read
నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల కాలనీలను డిసెంబర్ లోగా పూర్తిచేసి, నిర్వాసితులందరినీ కాలనీలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి గురువారం పోలవరం ప్రాజెక్ట్ పునరావాసం, కాలనీల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ, కాలనీల నిర్మాణపనులపై అధికారులతో జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ మొదటి దశ నిర్వాసితులకు నిర్మిస్తున్న కాలనీలను వెంటనే పూర్తిచేసి, వారిని సదరు కాలనీలకు డిసెంబర్ లోగా తరలించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల ననుసరించి కాలనీలలో ఇళ్ల నిర్మాణ పనులతో పాటు కాలనీలలో రోడ్లు, డ్రైనేజి, అంగన్వాడీ, పాఠశాలలు, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను నిర్వాసితులను కాలనీలకు తరలించే ముందుగానే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలనీల నిర్మాణానికి, మౌలిక సదుపాయాల ఏర్పాటు నిమిత్తం ఇంకా చేయవలసిన భూసేకరణను వెంటనే పూర్తిచేయాలన్నారు. భూసేకరణ లో అవకతవకలకు పాల్పడినా,కాలనీల నిర్మాణాల విషయంలో అలసత్వం వహించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి రాములు నాయక్, ఎస్డీసీ దేవకీదేవి, పంచాయతీ రాజ్, రహదారులు, భవనాల శాఖ ఎస్ఈ లు జెడ్. రమేష్, విజయరత్నం, సంబంధిత మండలాల జాతీయ రహదారి సంస్థ అధికారులు,భూసేకరణ విభాగం అధికారులు, తహసీల్దార్లు,ప్రభృతులు పాల్గొన్నారు.



