బహిరంగ ప్రదేశాల్లో ‘బాటిల్ బిన్స్’
1 min read
నగరంలోని 20 బహిరంగ ప్రదేశాల్లో ‘బాటిల్ బిన్స్’ ఏర్పాటు
అన్న క్యాంటీన్ నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేసిన కమిషనర్
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం నగరంలోని 20 బహిరంగ ప్రదేశాల్లో ‘బాటిల్ బిన్స్’ ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శనివారం ఆయన వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బాటిల్ బిన్స్‌ను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో బస్టాండ్, రైల్వే స్టేషన్, నగరపాలక కార్యాలయం, బళ్లారి చౌరస్తా, కలెక్టరేట్, గుత్తి పెట్రోల్ బంక్, రాజ్ విహార్, కొండారెడ్డి బురుజు, సి.క్యాంపు సెంటర్, చెక్‌పోస్ట్ తదితర బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఖాళీ వాటర్ బాటిళ్లను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా బాటిల్ బిన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటర్, కూల్‌డ్రింక్స్ వంటి వాటి ప్లాస్టిక్ బాటిళ్లను రహదారులపై పడేయడం వల్ల గాలికి ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు కలగడమే కాకుండా పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బహిరంగ ప్రదేశాల్లో బాటిల్ బిన్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు బాటిల్స్‌ను వాటిలోనే వేసి, నగర స్వచ్ఛతకు సహకరించాలని కమిషనర్ కోరారు.
అన్న క్యాంటీన్ నిర్వాహకులపై అసహనం
ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ తనిఖీ చేశారు. భోజనశాల అపరిశుభ్రంగా ఉండటం, సిబ్బంది తరచూ శుభ్రం చేయకపోవడంపై నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. సానిటరీ ఇన్స్పెక్టర్తో సమన్వయం చేసుకుని క్యాంటీన్ బయట, అలాగే అంతర్గత ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. పద్ధతి మార్చుకోకపోతే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ పవన్ కుమార్ రెడ్డి, సానిటరీ సూపర్వైజర్ రమేష్ బాబు, ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, మల్లికార్జున, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.


