నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
1 min read
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించాలి
నంద్యాల, న్యూస్ నేడు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 09వ తేదీన నంద్యాల జిల్లాలోని అన్ని గిరిజన పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు, గిరిజన గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జూమ్ సమావేశం నిర్వహించి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, వసతి గృహాల వార్డెన్లకు పలు సూచనలు చేశారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం ప్రతిబింబించేలా కార్యక్రమాలను రూపొందించి విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని అన్ని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు మరియు గిరిజన గ్రామాల్లో విద్యార్థులు, యువత, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాలను ఉత్సాహభరితంగా నిర్వహించాలని తెలిపారు. గిరిజనుల వారసత్వాన్ని, వారి ప్రత్యేక సంస్కృతిని భావితరాలకు పరిచయం చేసే విధంగా కార్యక్రమాలు ఉండాలని పేర్కొన్నారు.అలాగే, ఆగస్టు 09న నిర్వహించనున్న జిల్లా స్థాయి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు నంద్యాల జిల్లా పరిధిలోని గిరిజన సంఘాల నాయకులు, ప్రతినిధులు, గిరిజన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోరారు.


