NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సున్నిపెంట ఆక్రమణలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి

1 min read

కేటగిరీల వారీగా ఆక్రమణల వివరాలను పక్కాగా పరిశీలించండి

జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు: సున్నిపెంటలోని ఆక్రమణలకు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రెవెన్యూ, సర్వే అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌తో కలిసి సున్నిపెంటలోని ఆక్రమణలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమావేశంలో ఆత్మకూరు ఆర్డీఓ వెంకట శివ ల్యాండ్ అండ్ సర్వే ఎడి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, సున్నిపెంట పరిధిలోని ఆక్రమణలకు సంబంధించి అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, భూ సర్వే వివరాలను ఆధారంగా తీసుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి, పూర్తి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆక్రమణలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, వారిలో అనుమతులు ఉన్నవారు ఎంతమంది, అనుమతులు లేకుండా ఉన్నవారు ఎంతమంది అనే వివరాలను కేటగిరీల వారీగా నమోదు చేసి నివేదిక రూపొందించాలన్నారు.  అలాగే APL, BPL కుటుంబాల సంఖ్య, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారు, పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు, గతంలో ఎవరికైనా పట్టాలు జారీ చేశారా లేదా అనే అంశాలను కూడా పరిశీలించి డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.గతంలో జరిగిన పరిశీలనలు, సంబంధిత కేసులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. కోర్టు కేసుల పరిధి, అందుబాటులో ఉన్న రికార్డులు, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గతంలో జరిగిన సమీక్ష సమావేశాల మేరకు చేపట్టిన డేటా సెగ్రిగేషన్ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా రికార్డులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. అదేవిధంగా మిగిలిన ఆక్రమణలకు సంబంధించి వాటి స్వభావం, అర్హతలు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ నిబంధనలు తదితర అంశాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణకు (రెగ్యులరైజేషన్) అవకాశం ఉన్న అంశాలను స్పష్టంగా గుర్తించాలని కలెక్టర్ సూచించారు. అలాగే హైకోర్టులో కొనసాగుతున్న కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున సమర్పించాల్సిన కౌంటర్ అఫిడవిట్‌కు అవసరమైన వాస్తవ వివరాలను సంబంధిత రికార్డుల ఆధారంగా సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ, సర్వే శాఖలకు చెందిన సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author