NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అవయవదానంపై అపోహలు వీడి అవగాహన పెంచుకోవాలి

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ అవయవదానంను నిర్వహిస్తారు. అవయవదానం ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులకు కొత్త జీవితంపై ఆశ కల్పించడం ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశ్యం. ఒక వ్యక్తి అవయవదానం ద్వారా మరొకరి జీవితాన్ని కాపాడే అవకాశం లభిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.ప్రస్తుతం కిడ్నీ, కాలేయం, గుండె వంటి ముఖ్యమైన అవయవాల పనితీరు తీవ్రంగా దెబ్బతిన్న అనేక మంది రోగులు అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు. సరైన సమయంలో అందుబాటులోకి వచ్చే దాత అవయవం వారికి ప్రాణదాతగా మారుతుంది. అందువల్ల అవయవదానం గురించి ప్రజలు సరైన అవగాహన కలిగి ఉండటం, అపోహలను తొలగించుకోవడం ఎంతో అవసరమని మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ వైద్యులు తెలిపారు.నెఫ్రాలజిస్ట్ డా. సిద్ధార్థ్ హెరూర్ మాట్లాడుతూ, “కిడ్నీ వ్యాధి చివరి దశకు చేరుకున్న రోగులకు కిడ్నీ మార్పిడి ఒక ముఖ్యమైన చికిత్సా మార్గం. అయితే, అవయవదానం చేసే వారి సంఖ్యతో పోలిస్తే మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రజల్లో అవయవదానంపై అవగాహన పెరగాలి. ఒక వ్యక్తి అవయవదానం చేయాలనే నిర్ణయం ఒకరి జీవితాన్నే కాదు, అనేక మంది జీవితాలను మార్చే అవకాశం కల్పిస్తుంది” అని తెలిపారు.ఆయన మాట్లాడుతూ, “అవయవదానం విషయంలో ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అవయవదానం ప్రక్రియ గురించి సరైన సమాచారాన్ని వైద్య నిపుణుల ద్వారా తెలుసుకోవాలి. తాము అవయవదానం చేయాలనే నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు ముందుగానే తెలియజేయడం కూడా చాలా ముఖ్యం. అవయవదానం అనేది కేవలం వైద్యపరమైన నిర్ణయం మాత్రమే కాదు, సమాజం పట్ల మన బాధ్యతను చూపించే గొప్ప మానవతా చర్య” అని పేర్కొన్నారు.

About Author